రంగారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వాపోయారు. ఇప్పటివరకు స్థానం దక్కని ప్రతి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ర్టానికే గుండెకాయలాంటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను విస్మరించొద్దని, రాష్ట్ర జనాభాలో ఈ రెండు జిల్లాల్లోనే 47శాతం ఉన్నారని గుర్తుచేశారు. మంత్రిపదవి విషయంలో అధిష్ఠానం తన మొర వినలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
మంత్రివర్గ విస్తరణ అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం మల్రెడ్డి నివాసానికి వచ్చి మంత్రి పదవి విషయంలో బుజ్జగించారు. అనంతరం మల్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తల డిమాండ్ మేరకే తాను మంత్రి పదవి అడుగుతున్నట్టు చెప్పా రు. కార్యకర్తలు లేకుండా తాము పనిచేయలేమని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది తామేనని చెప్పారు. పార్టీ లైన్లోనే ఉండి పనిచేస్తానని తెలిపారు.
అధిష్ఠానం పొరపాటు చేయవద్దని కోరినట్టు చెప్పారు. పార్టీలో కొత్తగా వచ్చినవారికి పదవులిస్తే ఎన్నో ఏళ్లుగా పా ర్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలు బాధపడుతున్నారని తెలిపారు. అధిష్ఠానానికి తన గోడును చెప్పేందుకు అవకాశమివ్వాలని టీపీసీసీ అధ్యక్షుడిని కోరినట్టు తెలిపారు. మంత్రి పదవి విషయంలో రాహుల్‌గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతిస్తామని, పార్టీకి నష్టం జరుగుతున్నదని అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చినా దిద్దుబాటు చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు. మంత్రి పదవి విషయంలో తన సామాజిక వర్గం అడ్డొస్తే పార్టీకోసం ఏ త్యాగమైనా చేస్తానన్నారు.