హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకు తనను అక్రమంగా విధుల నుంచి తొలగించారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పదేండ్లపాటు పనిచేసిన మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలోత్ అరుణ్‌సింగ్ ఆరోపించారు. సెర్ప్‌లోని స్త్రీనిధిలో జరిగిన భారీ అవినీతిని, నిధుల మళ్లింపును బయటపెట్టినందుకు తనపై ఆ సంస్థ ఎండీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ముందస్తు నోటీసు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తొలగించడమే కాకుండా, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని తెలిపారు.
స్త్రీ నిధిలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని, అక్రమంగా తొలగించిన తనకు తిరిగి ఉద్యోగం కల్పించాలని కోరారు. ప్రజావాణిలో సీఎం రేవంత్‌రెడ్డికి, ఎస్సీ ఎస్టీ కమిషన్, కలెక్టర్లు, మంత్రులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో తనకు న్యాయం చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను వేడుకున్నారు. ప్రభుత్వం న్యాయం చేయలేకపోతే కారుణ్యమరణానికి అనుమతించాలని వినతిపత్రంలో విజ్ఞప్తిచేశారు.