హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల్ల పురోగతి గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆరా తీశారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు అందడంలేదని ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఖర్గే ఈ అంశంపై మంత్రితో చర్చించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. నిజానికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ‘ఓ అడుగు ముందుకి.. రెండడుగులు వెనక్కి’ అన్న చందంగా కొనసాగుతున్నది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపుతుంటే.. మరోవైపు కేంద్రం రూపొందించిన యాప్ వేల సంఖ్యలో లబ్ధిదారుల పేర్లను తొలగిస్తున్నది.
దీంతో ఇండ్లు మంజూరైనవారు లబోదిబోమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఆ తర్వాత 4.5 లక్షల ఇండ్లకే పరిమితం కావడం, ఆ ఇండ్ల నిర్మాణం కూడా పూర్తిస్థాయి లో ప్రారంభం కాకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం బెంగుళూరు వెళ్లి మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం, ఇందిరమ్మ పథకం పురోగతిపై ఖర్గే ఆరా తీయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.