హైదరాబాద్, జూలై11 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఉద్యమ చైతన్యకెరటం, తెలంగాణ వాగ్గేయకారుడు మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదాన సభను శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి, చేతన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరుకానున్నారు. ‘ఏమున్నదక్కో..’, తలాపునా పారుతుంది గోదారి, పారాని ఆరలేదు చెల్లెలా వంటి అనేక ప్రజాదరణ పొందిన పాటలతో సింగరేణి ప్రాంతంలో ఉద్యమచైతన్యాన్ని రగిలించిన వాగ్గేయకారుడు సదాశివుడు.
తెలంగాణ ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాగ్గేయకారుడు మల్లవఝుల సదాశివుడు రాసిన పాటలంటే ఎంతో అభిమానం. వాగ్గేయకారుడు సదాశివుడు స్మారకార్థం తెలంగాణ వికాస సమితి, చేతన సాహితీ సమాఖ్యలు సంయుక్తంగా ప్రతి సంవత్సరం స్మారకపురస్కారాన్ని అందిస్తున్నాయి. 2022 సంవత్సరానికిగాను సదాశివుడి స్మారక పురస్కారానికి ప్రముఖ కవి మోహన్‌రుషి, 2023 సంవత్సరానికిగాను రచయిత పసునూరు శ్రీధర్‌బాబును ఎంపిక చేశారు.
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అధ్యక్షతన రవీంద్రభారతి వేదికగా శనివారం సాయంత్రం 5 గంటలకు పురస్కార ప్రదాన సభ జరుగనున్నది. ఈ కార్యక్రమానికి వక్తగా హైదరాబాద్ సిటీ కాలేజీ తెలుగు శాఖ అధ్యక్షుడు కోయి కోటేశ్వరరావు హాజరుకానున్నారని తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్, చేతన సాహితీ సమాఖ్య వ్యవస్థాపకులు మల్లావఝుల విజయ్ వెల్లడించారు.