హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): నెలలు నిండకముందే ముందే కేవలం 890 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుతోపాటు తల్లిని మల్లారెడ్డి నారాయణ దవాఖాన వైద్య బృందం ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యబృందం గురువారం మీడియాకు వెల్లడించింది. సూరారం కాలనీకి చెందిన దరి విమల మార్చి 7న గర్భ సంబంధిత వైద్య పరీక్షల నిమిత్తం మల్లారెడ్డి నారాయణ దవాఖానకు వచ్చింది. ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో దవాఖానలో అడ్మిట్ చేసుకొని వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. రక్తపోటును నియంత్రణలోకి తీసుకొచ్చాక (సుమారు ఏడు నెలలు) 29 వారాల గర్భంతోనే కేవలం 890 గ్రాముల బరువుతో శిశువుకు జన్మనిచ్చింది.
ప్రసవ సమయంలో శ్వాసకోశ ఇబ్బంది తలెత్తినప్పటికీ సమయస్ఫూర్తితో అడ్డంకులను తొలగించినట్టు వైద్యులు తెలిపారు. దవాఖానలో నియోనాటల్ కేర్ టీమ్ నిరంతర పర్యవేక్షణలో పాప 70 రోజుల్లోనే 710 గ్రాములు పెరిగి ప్రస్తుతం 1600 గ్రాముల బరువుతో శిశువు ఉన్నట్టు పేర్కొన్నారు. మల్లారెడ్డి నారాయణ దవాఖానలో ప్రపంచ స్థాయి నియోనాటల్ కేర్ సేవలను నిబద్ధతతో అందిస్తున్నామని, నియోనాటాలజిస్ట్ డాక్టర్ దీపా డీ శెట్టి, సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ కే రాజశేఖర్ చెప్పారు. తల్లీబిడ్డ ప్రాణాలను రక్షించిన వైద్యులకు శిశువు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైద్యులు డాక్టర్ దీపా ధరణప్ప, డాక్టర్ ఎల్ ప్రణతిరెడ్డి పాల్గొన్నారు.