దమ్మపేట, ఆగస్టు 11/హైదరాబాద్, (నమస్తేతెలంగాణ): తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తూతా నాగమణి (69) కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆమె నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో, 2001కి ముందు వరకు కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. తర్వాత కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్)లో చేరారు.
తెలంగాణ ఉద్యమంలోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యభూమిక పోషించారు. ఆమె ఉద్యమంలో ఉన్న సమయంలోనే అనారోగ్యంతో ఓ కూతురు చనిపోయింది. ఆ తర్వాత భర్త కూడా చనిపోయాడు. వాటన్నింటినీ దిగమింగుకున్న నాగమణి.. నమ్మిన పార్టీ కోసం, నమ్మిన నేత కోసం ఉద్యమించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె.. తన తుదిశ్వాస వరకు తాను నమ్మిన జెండాను వదల్లేదు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెను ‘అక్కా’ అంటూ సంబోధించేవారు. వారి మధ్య అంతటి ఆప్యాయత ఉన్నది. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ దమ్మపేటలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైనప్పుడు కూడా నాగమణితో ప్రత్యేకంగా మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. గౌరవప్రదంగా వేదికపై ఆమెకు సీటు కూడా కేటాయించారు.
నాగమణి మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఆమె పార్టీ అభివృద్ధికి కృషిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.