Jagadish Reddy | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ నివేదికపై కొన్ని మీడియా సంస్థలు రోత రాతలతో తప్పుడు కూతలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే అవి కుట్రలకు తెగబడుతున్నాయని నిప్పులు చెరిగారు. సీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదిక వివరాలు ఆ మీడియా సంస్థలకు ఎలా తెలిశాయని నిలదీశారు. వాళ్లు రాస్తున్న రాతల్లో.. చెప్తున్న మాటల్లో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టంచేశారు. కాళేశ్వరం నివేదికపై వస్తున్న చెత్త వ్యాఖ్యానాలను, రోత రాతలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.
నాలుగేళ్లలోనే బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతాంగానికి అంకితమిచ్చి సాగులో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. 20 ‘ఏండ్ల క్రితం ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చినా పూర్తిచేయకపోవడం ఏపీ పాలకుల వైఫల్యానికి నిదర్శనం కాదా? ఏటీఎంలా మార్చుకున్నది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. శనివారం తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ బడుగుల లింగ య్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, గూడూరి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి 600 రోజుల పాలనలో 200 రోజులు ఢిల్లీకే పరిమితమయ్యారని ఎద్దేవాచేశారు. ఎక్కే విమానం.. దిగే విమానం అన్నట్టుగా ఢిల్లీకి చక్కర్లుకొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నారని దెప్పిపొడిచారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో పదిసార్లు కూడా ఢిల్లీకి వెళ్లకుండానే అనేక ప్రాజెక్టులు పూర్తిచేశారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. కానీ 20 నెలల్లో 50సార్లు చక్కర్లు కొట్టిన రేవంత్‌రెడ్డి ఏం సాధించారని నిలదీశారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకొనేందుకు కమిషన్ల పేరిట రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డి.. నాడు గద్దెనెక్కేందుకు వాడుకున్న సోషల్ మీడియా ను చూసి ఇప్పుడు ఆయనే గజగజ వణికిపోతున్న డు..నిందలు వేస్తూ జర్నలిస్టుల చెంపలు పగులగొడత అని బెదిరిస్తున్నడు. తనకు ఇష్టమైన ప్రాంతం అశోక్‌నగర్ చౌరస్తాకు వెళ్లేందుకూ భయపడుతున్నడు..నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వస్తుందనే ఆందోళనతో వెనకడుగు వేస్తున్నడు’ అని తూర్పారబట్టారు. యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టే ఎదురు చూపులు చూసే దుస్థితి తెచ్చారని విమర్శించారు.
నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ప్రశ్నించిన వారిని దూషిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. మీటింగ్‌కు రానని సోనియా రాసిన లెటర్‌ను చూపు తూ ఆస్కార్ అవార్డు అని, లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ తో సమానమని రేవంత్ చెప్పుకోవడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లి 50 పైసలు కూడా తేని రికార్డును సొంతం చేసుకున్న ఆయన అసమర్థుడిననే అవార్డుకు దరాఖాస్తు చేసుకోవాలని దెప్పిపొడిచారు. సంచుల పంపిణీకే ఢిల్లీకి వెళ్తున్నానని ఒప్పుకోవాలని సూచించారు. తెలంగాణకు చెందిన రూ.50 వేల కోట్లు ఢిల్లీకి చేరడంతో ఇక్కడి పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాలు కోమాలోకి వెళ్లిపోయాయని విమర్శించారు.
చావును సైతం లెక్కచేయకుండా తెలంగాణను సాధించిన కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేందుకు మీడియా ముసుగులో కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరిట ఆధారల్లేకుండా వార్తలు రాస్తూ వ్యాఖ్యలు చేస్తూ బద్నాం చేసేందుకు కుతంత్రాలకు దిగుతున్నాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక బయటకు రాకముందే ఒక్కొక్కరూ పరకాయ ప్రవేశం చేసి చెత్త రాతలు రాయడం దారుణమని మండిపడ్డారు.
‘ఫోన్ ట్యాపింగ్ ద్వారా భార్యాభర్తల మాటలు విన్నారు.. ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులను పక్కనబెట్టి నిర్ణయాలు తీసుకున్నారు అని సీఎంవో నుంచి వస్తున్న లీకుల ఆధారంగా వార్తలు రాస్తున్నారు..మైక్‌లు పట్టుకొని చెత్త మాటలు మాట్లాడుతున్నరు’ అని ఫైర్ అయ్యారు. ఇది మంచి పద్ధతి కాదని, ఇప్పటికైనా వారు తీరు మార్చుకోవాలని హితవుపలికారు.
కేసీఆర్, బీఆర్ఎస్ గురించి వార్తలు రాసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘ఆధారాలిచ్చి వ్యక్తులను ఉటంకిస్తూ వార్తలు రాస్తే రాసుకోండి..అంతేగానీ ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే ఊరుకునేది లేదు’ అని తీవ్రంగా హెచ్చరించారు. కేసీఆర్ కారణంగానే యాదాద్రి పవర్‌ప్లాంట్ ఆలస్యమైందని ఓ విలేకరి అడగ్గా.. ఇందు లో ఎంతమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు, వెచ్చించిన నిధులు, బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన పనులు, ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు బనకచర్లపై ఏమాత్రం అవగాహనలేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి సాక్షిగా బనకచర్ల ప్రాజెక్టు పూర్తికావడానికి కారణం కేసీఆరే అని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆయన జ్ఞానిని మించి బ్రహ్మజ్ఞానిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కనీసం రేవంత్‌రెడ్డిని సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సందర్భంలోనైనా బనకచర్ల గురించి తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌లు చేతగాని దద్దమ్మలనే భావించి కాంగ్రెస్ అధిష్ఠానం మీనాక్షి నటరాజన్‌ను పాదయాత్రకు పురమాయించిందని స్పష్టంచేశారు. ఈ అవమానానికి ముఖ్యమంత్రి సీట్లో ఎవరున్నా దిగిపోయేవారని, కానీ రేవంత్‌రెడ్డి మాత్రం నిస్సిగ్గుగా సీటును పట్టుకొని వేలాడుతున్నారని ధ్వజమెత్తారు.