హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపడానికి భారీ కుట్ర జరిగిందా? భవిష్యత్తులో తన పీఠానికి ప్రధాన పోటీదారుడు అవుతారనే సంకేతాలు ముఖ్యనేతకు అందాయా? రాష్ట్రంలో బీసీ సామాజికవర్గ రాజ్యాధికార కాంక్షకు, ముఖ్యనేత సన్నిహిత మీడియాలో మహేశ్‌గౌడ్‌పై వ్యతిరేక కథనాలకు లింక్ ఉన్నదా? అంటే గాంధీభవన్ వర్గాలు ‘అవును’ అనే చెప్తున్నా యి.
తెలంగాణలో జరిపిన కులగణన దేశ రా జకీయాలనే కుదిపేసేంత కీలమైనవని, బీసీల విద్య, ఉద్యోగాలు, రాజకీయల్లో పెనుమార్పులు తెస్తాయని గత ఏడాది జూలైలో లోక్‌సభలో రాహుల్‌గాంధీ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో బీసీ సామాజికవర్గాలకు రాజ్యాధికార కాంక్ష తారస్థాయికి చేరింది. ఫలితంగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యం తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం.. సీనియర్ కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రునిగా గుర్తింపు ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిణామాలే ముఖ్యనేతకు కంటిమీద కునుకు లేకుండా చేశాయని ప్రచారం జరుగుతున్నది.
ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల శిక్షణ శిబిరం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్ సమన్వయం చేశారు. కార్యక్రమాల రూపకల్పన నుంచి అమలు వరకు ఆయన చూపిన క్రమశిక్షణకు రాహుల్‌గాంధీ అబ్బురపడ్డారని పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. శిక్షణ ముగింపు కార్యక్రమానికి రాహుల్‌గాంధీ వచ్చారు. ఈ సందర్భంగా ‘వెల్డన్ మహేశ్’ అంటూ టీపీసీసీ చీఫ్‌ను అభినందించారని, ఢిల్లీకి వచ్చి కలవాలని ఆహ్వానించారని సమాచారం. అప్పటినుంచే మహేశ్‌కుమార్ గౌడ్‌ను తొక్కేయడానికి ముఖ్యనేత సన్నిహితవర్గం కుట్రలు మొదలుపెట్టినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. తన మీద జరుగుతున్న కుట్రలను, ముఖ్యనేత సోదరులు చేస్తున్న దందాలను ఆయన మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రాష్ట్రంలో త్వరలో జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో టీపీసీసీ చీఫ్‌కు కీలక పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. బీసీ కోటాలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించే యోచన చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ఆయనను సిద్ధం చేయాలని రాహుల్‌గాంధీ ఆలోచిస్తున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే చెప్తున్నాయి.
ఈ నిర్ణయం తన రాజకీయ భవిష్యత్తుకు ప్రధాన అడ్డంకి అని ముఖ్యనేత భావించారని, అందుకే ఆయన వర్గం మహేశ్‌కుమార్‌గౌడ్‌ను టార్గెట్ చేసినట్టు చెప్తున్నారు. ఆయనను ఏకంగా పార్టీ నుంచి సాగనంపాలనే కుట్రలు చేసినట్టు తెలిసింది. అయితే గడిచిన ఎనిమిది తొమ్మిది నెలలుగా మహేశ్‌గౌడ్ పూర్తిగా ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్‌కు అందుబాటులో ఉండి, ఆమె సూచనలకు అనుగుణంగా పని చేస్తున్నట్టు చెప్తున్నారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న తతంగాన్ని, టీపీసీసీ అధ్యక్షుని మీద జరుగుతున్న రాజకీయ కుట్రలను ఆమె ఢిల్లీకి వివరించినట్టు తెలిసింది. దీంతో ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్నారని, ఆ తర్వాతే ముఖ్యనేత సన్నిహిత మీడియా వెనక్కి తగ్గినట్టుగా ప్రచారం జరుగుతున్నది.
రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యనేత చకోర పక్షిలా ఎదురుచూస్తున్న సమయంలో.. ఏప్రిల్ 23న మహేశ్‌కుమార్‌గౌడ్‌ను రాహుల్‌గాంధీ ఢిల్లీకి ఆహ్వానించారు. దీంతో ఆయన కుటుంబ సమేతంగా వెళ్లి అగ్రనేతను కలిశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల పురోగతి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తున్నాయనే అంశంపై రాహుల్ ఆరా తీసినట్టు సమాచారం.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ బీసీ జనుల ఆకాంక్షను ఆయనకు వివరించినట్టు తెలిసింది. దీనిపై రాహుల్‌గాంధీ స్పందిస్తూ మంత్రివర్గంలో బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నదని, భవిష్యత్తులో పార్టీ అప్పగించే కీలక బాధ్యతలు స్వీకరించటానికి సిద్ధంగా ఉండమని మహేశ్‌గౌడ్‌కు సూచించినట్టు తెలిసింది. అందుకే భేటీ అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీసీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.