హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరంలో వెలుగు చూసిన మలేరియా కేసులు 5,222. గత ఏడాది నమోదైన కేసులు కేవలం 611. తొమ్మిదేండ్లలోనే మలేరియా బాధితుల సంఖ్య 90 శాతం పడిపోయింది. మలేరియా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎంత కృషి చేస్తున్నదో దీనిని చూసి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్యశాఖ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. నిరుడు దేశంలో 1.73 లక్షల మలేరియా కేసులు నమోదుకాగా.. తెలంగాణలో కేవలం 611 మాత్రమే బయటపడ్డాయి. అంటే దేశవ్యాప్త కేసుల్లో కేవలం 0.35%. రాష్ట్రంలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనే నమోదవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నివారణ కోసం సీజన్ ప్రారంభం కాకముందే దోమల నివారణ మందులను పిచికారీ చేయించింది. తీవ్రత అధికంగా ఉన్న జిల్లాల్లో 7.5 లక్షల దోమతెరలు పంపిణీ చేసి, ప్రజలు దోమకాటుకు గురికాకుండా కాపాడుతున్నది. ఒకవేళ ఎవరికైనా మలేరియా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే రక్త పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నది. ఆరోగ్య శిబిరాల నిర్వహణ, అవగాహన సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్శంగా ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘నూతన ఆవిష్కరణలు, కార్యక్రమాల ద్వారా మలేరియా రహిత ప్రపంచాన్ని సాధించాలి’ అనే నినాదాన్ని ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వ అవార్డే నిదర్శనం
రాష్ట్రంలో మలేరియా నివారణకు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. నీరు నిల్వ ఉండకుండా చూడటం, నిలిచి ఉన్న నీళ్లలో లార్వా పెరగకుండా రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం. ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సులు, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. దీంతో రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయి. గత ఏడేండ్లుగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ర్టానికి ‘బెస్ట్ పర్ఫామెన్స్ స్టేట్’ అవార్డును అందజేసింది.
– డాక్టర్ గడల శ్రీనివాసరావు, డీపీహెచ్
11