MLA Palla Rajeshwar Reddy : ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్లో ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను విచారణ పేరుతో వేధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) ఆరోపించారు. సంతోష్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటినుంచి బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నదని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమీ లేదని సుప్రీం కోర్టు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులను విచారణ పేరుతో పిలిచింది. ఇప్పుడు సంతోష్ కుమార్‌ను కూడా సిట్ పిలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేస్ అన్నది పస లేని కేసు. రేవంత్ రెడ్డి తన అసమర్థ పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కేసును ఆయుధంగా వాడుకుంటున్నారు అని పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు.