Telangana | హైదరాబాద్,(నమస్తే తెలంగాణ) ; హైదరాబాద్‌లో సచివాలయానికి కూతవేటు దూరంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సాక్షాత్త్తు సీఎం రేవంత్‌రెడ్డినే ఓ మహిళ నిలదీసింది. ‘గొప్పలు ఎందుకన్నా.. ముందు ఇచ్చిన మాట ప్రకారం రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వన్నా.. నీకు పుణ్యముంటుంది’ అంటూ నిరసన స్వరం వినిపించింది. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఆర్టీసీ ఫ్రీ బస్సుపై ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని, మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్యే వివేక్‌ను, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని మహిళలు ప్రశ్నించారు. నిలదీతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు ప్రసంగాలను హడావుడిగా ముగించి వెళ్లిపోతున్నారు.
కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సచివాలయానికి కూతవేటు దూరంలో ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది..ఆయన ప్రసంగిస్తున్న సమయంలో నవనీత అనే మహిళ ధిక్కార స్వరం వినిపించింది. అన్నా అంటూ సంబోధిస్తూనే సంక్షేమ పథకాలపై ప్రశ్నించింది. గొప్పలు చెప్పుకోవడం కాదని ఇచ్చిన మాట మేరకు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని నిలదీసింది. అప్పుడే ఇంతకంటే పెద్ద పండుగ చేసుకుందామని తేల్చిచెప్పింది. ఆమె మా టల్లోనే.. ‘అన్నా రేవంత్ అన్నా.. ఇయ్యాల వికలాంగుల దినోత్సవం. గొప్పలు చెప్పుకోవడం ఎందుకన్న? నీకు చేతులెత్తి మొక్కుతున్న. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళ లు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వండి. అవసరమున్నోళ్లకు రేషన్ కార్డులివ్వండి. ఇదొక్కటే కోరుకుంటున్నం. జర నీకు పుణ్యముంటది. అప్పుడు ఈ ఏడాది పండుగకంటే మించి లక్షల మందితో సభ పెట్టుకుందాం’ అని చెప్పింది. ఆమె మాటలు విన్న అక్కడివారు ఆ మహిళను మెచ్చుకోవడం కనిపించిం ది. అయితే, నవనీత మాటలను సీఎం విననట్టుగానే వెళ్లిపోయారు.
కాంగ్రెస్ ప్ర భుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకంలోని ఫ్రీ బస్సు పేరుకే .. మహిళల పట్ల ఆర్టీ సీ ఉద్యోగులు చిన్నచూపు చూస్తున్నారు.. మహిళలను చూస్తేనే రోడ్డుపై, స్టేజీల వద్ద బస్సులు ఆపకుండా వెళ్తున్నారు.. అసలు ఫ్రీ బస్సు ఏ ఉద్దేశంతో.. ఎవరి కోసం పెట్టారు’.. అంటూ మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మహిళలు నిలదీశారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని ని ర్వహించిన అర్బన్‌డే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైం ది. ఫ్రీ బస్సు ప్రారంభించి మహిళలకు జీరో టికెట్ అందించి వారి చార్జీలను ప్ర భుత్వమే భరిస్తున్నదని ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. పలువురు మహిళలు ఒకసారిగా గొంతెత్తారు. అలాగే పెంచిన పింఛన్ రూ.4 వేలు ఇవ్వడం లేదు .. పాత పింఛన్ కూడా సక్రమంగా అందించడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే వద్దకు వెళ్లకుండా మహిళా కానిస్టేబుళ్లు, పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు.

తులం బంగారం ఏది? ఎమ్మెల్యే వివేక్‌పై మహిళల ఆగ్రహం
భీమారం, డిసెంబర్ 3 : ‘కల్యాణ లక్ష్మి పథకం కింద రూ. లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తమని చెప్పి ఓట్లు వేయించుకుంటిరి. అధికారంలోకి రాంగనే మాట తప్పితి రి.. ఇదెక్కడి న్యాయం. తులం బంగారం అయినా ఇవ్వండి.. లేదంటే రూ. 90 వేల నగదైనా ఇవ్వండి.” అంటూ మంగళవారం మంచిర్యాల జిల్లా భీమారంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌ను మహిళలు నిలదీశారు. స్థానిక రైతు వేదికలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తుండగా, తులం బంగారం ఎప్పుడిస్తరు అని మహిళలు వివేక్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఆయన జనవరి నుంచి తులం బంగారం వస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్నారు. మాయమాటలు చెప్పి మాతో ఓట్లు వేయించుకొని అన్యాయం చేశారని మండిపడ్డారు.
కోతుల బెడద నుంచి కాపాడాలి
భీమారంలో కోతుల బెడదను నివారించాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌ను గ్రామీణ చైతన్య సేవ సమితి సభ్యులు నిలదీశారు. ప్రజాఫిర్యాదు విభాగంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు వివేక్ స్పందిస్తూ రాష్ట్రమంతటా కోతుల బెడద ఉందని.. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మీరే చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. ఖర్చులు తాము భరిస్తామని చెబుతుండగానే.. వివేక్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. యువకులు మాట్లాడుతూ స్థానిక ఎలెక్షన్లప్పుడు తమ కాలనీకి వస్తే తరుముతామని హెచ్చరించారు.
‘డబుల్’ ఇండ్లు ఎప్పుడిస్తరు? ; ఎమ్మెల్యే కశిరెడ్డిని నిలదీసిన లబ్ధిదారులు
కల్వకుర్తి, డిసెంబర్ 3 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని లబ్ధిదారులు నిలదీశారు. మంగళవారం ప్రజాపాలన సంబురాల్లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయానికి ఎమ్మెల్యే రాగా.. డబుల్ ఇండ్ల లబ్ధిదారులు, కాలనీవాసులు వచ్చి కలిశారు. కల్వకుర్తిలో 99 సర్వే నంబర్లో 240 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించిందని, ఈ ఇండ్లను ఎప్పుడు అప్పగిస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే కల్పించుకొని చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయని, పూర్తికాగానే అప్పగిస్తామని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా.. కొందురు కాంగ్రెస్ నాయకులు కల్పించుకొని లబ్ధిదారులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 30 వరకు ఇండ్లు అప్పగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
