కరీంనగర్ : హైదరాబాద్ నగరం తర్వాత కరీంనగర్‌ను అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణం ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద రూ. 2.68 కోట్లతో చేపట్టనున్న ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగరాన్ని 2వ అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. నగరాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా ఆధునిక డిజైన్లతో 13 కొత్త ఐలాండ్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. మార్చి 31 లోగా 13 అందుబాటులో ఉన్న స్థలంలోనే ఆధునిక డిజైన్లతో గ్రీనరీ,వాటర్, లైటింగ్ సిస్టంతో అందంగా తీర్చి దిద్దుతున్నామని వెల్లడించారు.
కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వేలాదికోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారని తెలిపారు. నగరంలోని ప్రధాన అంతర్గత రోడ్లతో పాటు కూడళ్లను కూడా స్మార్ట్ గా అభివృద్ధి చేయాలన్నది తమ ధ్యేయమని, కేబుల్ బ్రిడ్జి ప్రారంభం లోగానే కూడళ్ల పనులను పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఇంత గొప్ప ఐలాండ్ లు ఎక్కడ లేవని అన్నారు. ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయని, సదాశివ పల్లి వద్ద కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు బిటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నగర ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా భద్రతావలయాన్ని పటిష్ట పరుస్తామని, ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తామని అన్నారు.