హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర క్యాబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైనా మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘సౌత్‌ఫస్ట్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ మంత్రివర్గంపై సౌత్‌ఫస్ట్ ఎడిటర్ జీఎస్ వాసు ప్రత్యేక కథనం రాశారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులుంటాయని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా సౌత్‌ఫస్ట్ కథనం ఉన్నది. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇవ్వనున్నదని కథనంలో పేర్కొన్నారు. ఇప్పటికి ఇంకా మంత్రివర్గంలో రెండు ఖాళీలున్నాయని, కొత్తగా ముగ్గురిపై వేటు పడనున్నదని వివరించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ పదవులు కోల్పోతారని కథనంలో రాశారు. పదవులు కోల్పోయే వారి స్థానంలో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పిస్తారని, పొన్నం ప్రభాకర్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు, కొండా సురేఖ స్థానంలో బీసీ వర్గానికే చెందిన ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్థానంలో నల్లగొండ నుంచే గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలునాయక్‌కు అవకాశం ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. బాలునాయక్‌కు పదవి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో లంబాడాలకు సముచిత స్థానం ఇచ్చినట్టు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉన్నది లంబాడాలేన్న భావనలో పార్టీ హైకమాండ్‌లో ఉన్నదని కథనంలో ప్రస్తావించారు.
ప్రజా వ్యతిరేకత..అవినీతి ఆరోపణలు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రెండేండ్లు గడవకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్నదని పార్టీ హైకమాండ్ గుర్తించినట్టు సౌత్‌ఫస్ట్ కథనం ప్రచురించింది. ఈ వ్యతిరేకత మరింత పెరగకముందే కాయకల్ప చికిత్స చేయాలని భావిస్తున్నట్టు రాసింది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయన్న ఫిర్యాదులు బాగా పెరిగాయని, మంత్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, అధికారులతో కలిసి దందాలు చేస్తున్నట్టు పార్టీ అధిష్ఠానం గుర్తించినట్టు పేర్కొన్నది. రెండేండ్ల క్రితం కాంగ్రెస్‌కు తెలంగాణలో ఉన్న ఆదరణ ఇప్పుడు కరువైందని పార్టీ అంతర్గత సర్వేలో సైతం తేలింది. రాష్ట్ర ప్రభుత్వం, టీపీసీసీపై నమ్మకం లేక స్వతంత్రంగా హైకమాండ్ సర్వే చేయించుకున్నట్టు తెలిసింది. ఆ సర్వే ఆధారంగానే మంత్రివర్గంలో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
పొన్నంకు పీసీసీ?
సౌత్‌ఫస్ట్ కథనం ప్రకారం మహేశ్ కుమార్ గౌడ్‌కు మంత్రి పదవి ఇస్తే ఆయన స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కు పీసీసీ పగ్గాలు దక్కవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. పార్టీలో సీనియర్‌గా, గతంలో ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం ఉన్న పొన్నం ప్రభాకర్ పార్టీకి విధేయుడిగా ఉంటారని, పార్టీ బలోపేతం కోసం ఆయనను పీసీసీ చీఫ్ చేస్తే ఉపయోగం అన్న ఆలోచనతో పార్టీ ఉన్నట్టు సమాచారం. ఇక మహేశ్ కుమార్ గౌడ్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పెద్దగా పొసగడం లేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టీ హైకమాండ్‌కు విధేయుడిగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాడని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మంత్రి కొండా సురేఖ ఆది నుంచీ వివాదాస్పదురాలిగానే ఉన్నారు.
ఆమె గతంలో సినీనటుడు నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన అన్నదమ్ములపై, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కొండా సురేఖ కూతురు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయన్న భావన అధిష్ఠానంలో ఉన్నది. ఇక కోమటిరెడి వెంకట్‌రెడ్డి విషయంలో ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తారని చెప్తున్నారు. అయితే, అది ఇప్పుడే ఇస్తారా? ఆగుతారా? అన్నదానిపై స్పష్టత లేదు. అదే జిల్లాకు చెందిన బాలునాయక్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు ఇప్పుడు వెంకట్‌రెడ్డిని తప్పిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే రెండు క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో పార్టీ ఇద్దరికి అవకాశం కల్పిస్తుందని చెప్తున్నారు. అలా కల్పించేవారిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉంటారని, మున్నూరు కాపు వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఉపయోగమని భావిస్తున్నట్టు సమాచారం.
దుద్దిళ్ల మినహా అందరి శాఖల్లో ..
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా మంత్రులందరి శాఖల్లో భారీగా మార్పులుంటాయని సమాచారం. ఒక్క శ్రీధర్‌బాబు పనితీరు మాత్రమే బాగుందని అధిష్ఠానం అంతర్గత పరిశీలనలో తేలినట్టు తెలిసింది. శ్రీధర్‌బాబు మినహా మిగిలిన సీనియర్ మంత్రుల శాఖలను మొత్తం మార్చే అవకాశం కనిపిస్తున్నది. శ్రీధర్‌బాబుకు మరికొన్ని ముఖ్యమైన శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పురపాలక, హోం, విద్యశాఖలను కూడా ఇతరులకు కేటాయిస్తారని చెప్తున్నారు.
ఉప ఎన్నిక తర్వాతే ముహూర్తం
మంత్రుల శాఖల్లో మార్పులు, కొందరిని తప్పించడం, మరికొందరికి అవకాశం ఇవ్వడం వంటివన్నీ నవంబర్ 11 తర్వాత ఏ క్షణమైనా ఉంటాయని సమాచారం. మిగిలిన మూడేళ్లకాలానికి ముందుచూపుతో మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేయాలన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చిందని తెలుస్తున్నది.