జగిత్యాల, జూలై 10 (నమస్తే తెలంగాణ): ‘సీఎం కేసీఆర్ సారు నాకే కాదు.. ఇంటింటికీ పింఛిన్, ఇంకా ఎన్నో పథకాలు మంచిగిస్తుండు బిడ్డా’ అని జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి శివారులో కంకులమ్మే బోదాసు నర్సమ్మ తన సంతోషాన్ని ఎమ్మెల్సీ కే కవితతో పంచుకొన్నది. జగిత్యాల జిల్లాలో సోమవారం పర్యటించిన ఎమ్మెల్సీ కవిత తిరుగుప్రయాణంలో నూకపల్లి శివారు వద్ద కాసేపు ఆగారు. రోడ్డు పకన మక్క కంకులు కాలుస్తున్న బోదాసు నర్సమ్మ దగ్గరికెళ్లి కంకులు కొనుగోలు చేసి, అకడే రుచి చూశారు. నర్సమ్మతో కవిత మాట కలిపారు. నర్సమ్మ ఇవి మన చేను కంకులేనా? అని అడగ్గా.. వేరే వాళ్ల వద్ద కొనుగోలు చేశానని, సంచికి వెయ్యి పడుతుందని, రోజుకు రూ.500- 600 మిగులుతాయని నర్సమ్మ బదులిచ్చింది.
‘మేం మస్తు మందిమి ఉన్నం.. అందరికీ సరిపోతయా’ అని కవిత నవ్వుతూ అడిగారు. కేసీఆర్ పాలన ఎలా ఉంది? అని కవిత ప్రశ్నించగా.. చాలా బాగుందని నర్సమ్మ సంతోషంగా సమాధానమిచ్చింది. స్వయంగా సీఎం కేసీఆర్ కూతురే తన వద్ద మక్క కంకి కొనుగోలు చేసి తింటూ మాట్లాడటంతో నర్సమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎమ్మెల్సీ కవితను రోడ్డు పక్కన చూసిన స్థానిక వాహనదారులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ అభిమానాన్ని చాటుకోగా.. ఆమె ప్రతి ఒకరినీ ఆప్యాయంగా పలుకరించారు. ముఖ్యమంత్రి కూతురు అయినా సాదాసీదాగా వ్యవహరించారని ఈ సందర్భంగా పలువురు వాహనదారులు చర్చించుకొన్నారు.