షాబాద్, ఏప్రిల్ 2: యాసంగి పంటలను ఎండబెట్టిన పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. ఈ నెల 13న చేవెళ్లలో కేసీఆర్ పాల్గొనే బీఆర్ఎస్ బహిరంగసభ కోసం మంగళవారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి పట్టణంలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజీలో స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ సరఫరా అయిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోతలు ఏవిధంగా ఉన్నాయో ప్రతి రైతుకు తెలుసునని చెప్పారు. గతంలో అదునుకు ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు ఇచ్చేవారని, కానీ ఇప్పుడు రైతుబంధు పడని రైతులు ఎంతోమంది ఉన్నారని తెలిపారు.
వేసవిలో ఏర్పడే తాగునీటి సమస్యను ఎలా పరిష్కరించాలో రాష్ట్ర పాలకులకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలు తెలుసుకోవడానికి, ఎండిన పంటలను పరిశీలించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారని తెలియగానే కాల్వల్లో నీళ్లను వదిలారని తెలిపారు. దీంతో సాగు, తాగునీరు ఉన్నా కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ వ్యవహరిస్తున్న విషయం బయటపడిందని చెప్పారు. చేవెళ్లలో జరిగే కేసీఆర్ సభకు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
ఉమ్మడి రంగారెడ్డి జడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ను చేవెళ్ల లోక్‌సభ స్థానంలో భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ నేతగా కేసీఆర్ తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం కల్పించారని, ఈ ప్రాంతప్రజలు ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో తెలంగాణ గొంతుకను వినిపిస్తానని తెలిపారు. ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, రాజుగౌడ్, బాల్‌రాజ్, ప్రభాకర్, యాదగిరి, చంద్రారెడ్డి, శివప్రసాద్, శేఖర్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.