ఆదిబట్ల, డిసెంబర్ 8: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థులు కళాశాల ఎదుట ప్లకార్డులతో ధర్నాకు దిగారు. 5 గంటలపాటు ధర్నా చేసినా కనీసం పట్టించుకునేవారు కరువయ్యారని వాపోయారు. అద్దె భవనంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి, కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. ల్యాబ్‌లో ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని, హాస్టల్లో నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు.
కళాశాల నుంచి బీఎన్‌రెడ్డినగర్ వనస్థలి పురంలో ఉన్న ఏరియా దవాఖానకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేదని వాపోయారు. బీటెక్ విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్‌కు వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు తెలిపారు. కళాశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని చెప్పారు. ఇక్కడ చదువుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని, ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.