హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): 22-ఏ నిషేధిత జాబితాతో క్విడ్ ప్రోకో జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో 22-ఏపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. టీజీఐఐసీకి చెందిన ఇండస్ట్రియల్ జోన్లో ని 7.19 ఎకరాల భూమిని రాత్రికి రాత్రే రెసిడెన్షియల్ జోన్లోకి మార్చి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారని ఆరోపించారు.
మంత్రి కుటుంబానికి చెందిన ఈ కంపెనీపై సమాధానం చెప్పాలని, ఇది క్విడ్ప్రోకో కిందికే వస్తుందని పేర్కొన్నారు. పుప్పాలగూడలో 285, 286, 287 సర్వేనంబర్లలో 7 ఎకరాల స్థలం రిజిస్ట్రేషన్ చేసేందుకు మొదట తిరస్కరించగా, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రవేశించగానే అనుమతులు ఇచ్చారని ఆరోపించారు.
20లక్షల భూముల్లో 5లక్షల భూములు 22ఏ నుంచి ఎలా తొలిగిపోయాయో ప్రభుత్వం నిజాలు బయట పెట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. మూడున్నర గంటలు మాట్లాడిన సీఎం గత ప్రభుత్వం అక్రమాలు చేసిందని ఆరోపిస్తున్నారని, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.