TAPTU | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీఏపీటీయూ నేతలు నిలదీశారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తామని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ట్రాన్స్పోర్ట్ యాప్ తీసుకొస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం రూపొందించిన గిగ్ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ టీఏపీటీయూ ఈ నెల 22న ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శనివారం గాంధీభవన్‌లో యూనియన్ నేతలతో మహేశ్‌కుమార్‌గౌడ్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది.
మన పార్టీ అనుబంధ సంఘమైన మీరే ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తే ఎట్లా?” అని మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ఆగ్రహించిన యూనియన్ నేతలు.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను మహేశ్‌కుమార్‌గౌడ్ టేబుల్ మీద పెట్టి, ఇదిగో ఒక్కసారి ఇందులో ఏముందో చూడండి. మీరే సమాధానం చెప్పండి అని నిలదీశారు. కార్మికవర్గాలను సంప్రదించకుండా ప్రభుత్వం రూపొందించిన గిగ్ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు తేల్చిచెప్పారు. కనీసం కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘంతో కూడా చర్చలు జరపడం వీలుకాలేదా అని ప్రశ్నించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని, 22నాటి ధర్నాను విరమించుకోవాలని మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారు.
ఇందుకు అంగీకరించిన కార్మిక నాయకులు.. ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. వారం, పది రోజులు చూస్తామని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ధర్నా తప్పదని తేల్చిచెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ క్యాబ్‌డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, టీఏపీటీయూ రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు నిలదీస్తుండగా, ఇప్పుడు కాంగ్రెస్ అనుబంధ యూనియన్ నుంచి కూడా నిరసనజ్వాలలు తప్పడంలేదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.