అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర రైతుల మనోభావాలనే దెబ్బతీసింది. ‘రైతు మహోత్సవం’ అంటూనే తెలంగాణ రైతులను హేళన చేసింది. తెలంగాణ రైతులకు ఎవుసమే తెలియదని, ఆంధ్రోళ్లు వచ్చి నేర్పించారని కారుకూతలు కూస్తూ అవమానించింది. నిజాంసాగర్ ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లు వలస వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తూ తెలంగాణ రైతులకు కూడా నేర్పించారంటూ నిజామాబాద్‌లో సోమవారం నిర్వహించిన రైతు మహోత్సవ సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు.. ఎవుసంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి.
Mahesh Kumar Goud | నిజామాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మరోసారి అవమానించింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలంగాణ రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ వ్యాఖ్యానించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ మైదానంలో నిర్వహించిన రైతు మహోత్సవం ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘1923లో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వారంతా వ్యవసాయం చేయడమే కాకుండా మాక్కూడా వ్యవసాయం నేర్పించారు’ అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రా ప్రాంతం వారి వల్లే తెలంగాణ రైతులు వ్యవసాయం నేర్చుకున్నారనేవిధంగా పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్నది. బాన్సువాడ, బోధన్, డిచ్‌పల్లిలో ఆంధ్రా రైతులు స్థిరపడ్డారంటే, అదంతా నిజాంసాగర్ ప్రాజెక్టు గొప్పతనం అంటూ చెప్పుకొచ్చారు. నిజాం వారందరినీ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారని (ఆంధ్రావారిని నిజాం తీసుకువచ్చాడంటూ (పక్క నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అందించడంతో) పీసీసీ చీఫ్ చెప్పారు. రైతులు ఓటేశారు కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యే లు విదేశాలకు వెళ్లడం కాదని, ఎంపికచేసిన రైతులను విదేశాలకు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇప్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మహేశ్‌కుమార్‌గౌడ్ కోరారు.
కాళేశ్వరంపై అదే అక్కసు
పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రూ.లక్షా 25 వేల కోట్లు గోదావరి నదిలో పోసిన పాపం కేసీఆర్‌ది అంటూ మహేశ్‌కుమార్‌గౌడ్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పదిసార్లు ఎత్తి పోస్తే కానీ మల్లన్నసాగర్‌కు నీళ్లు రావని వ్యాఖ్యానించారు. ఒక ఎకరానికి నీళ్లు రావాలంటే రూ.60 వేల కరెంటు బిల్లు వస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేస్తూనే మరోవైపు అదే ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీ-20, 21, 22 పనులను పూర్తిచేయడానికి రూ.600 కోట్ల నిధులు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ మంత్రిని కోరడం గమనార్హం.
ఆంధ్రా పాలకుల మెప్పు కోసమే తప్పుడు మాటలు: నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్ అపరిపక్వత, అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తెలంగాణకు తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు. ఆంధ్రా పాలకుల మెప్పుకోసమే ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని కేసీఆర్ పదే పదే చెప్పిన విషయం పీసీసీ చీఫ్ మాటలతో తేటతెల్లమైందని స్పష్టంచేశారు. వెయ్యేండ్ల క్రితమే మన ప్రాంతంలో వరి పండించిన ఆనవాళ్లు ఉన్నాయని చరిత్రకారులు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రపంచానికి వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ను నేర్పిన, అతిపెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టు కట్టిన ఘనత తెలంగాణ సొంతమని చెప్పారు. కానీ, పెద్దస్థాయిలో ఉన్న వ్యక్తి ఇవేమీ తెలియకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం అభ్యంతరకరమని పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పాలి: వేముల ప్రశాంత్‌రెడ్డి
ఆంధ్రాప్రాంతం వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తప్పుబట్టారు. మహేశ్‌కుమార్ వైఖరి యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు ఉన్నదని మండిపడ్డారు. భావదారిద్య్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తెలంగాణలో ఉన్నామనే సోయి మరిచి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మన వ్యవసాయ చరిత్ర తెలియని వ్యక్తులు పాలకులు కావడం దురదృష్టకరమని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలకు సోయి లేదు: జీవన్‌రెడ్డి
రాష్ట్ర కాంగ్రె స్ నేతలవి బానిస బతుకులని, వారికి బొత్తిగా తెలంగాణ సోయి లేదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన రైతులు వ్యవసాయం చేయడం నేర్పారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నిస్సిగ్గుగా వ్యాఖ్యానించ డం ద్వారా తెలంగాణ రైతులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. వేల ఏండ్లు గా వ్యవసాయం చేస్తున్న తెలంగాణ రైతులు దేశానికే రోల్ మాడల్ అని అభివర్ణించారు. సాగు పాఠాలు నేర్పడం తప్ప, నేర్చుకునే స్థితిలో తెలంగాణ రైతులు లేరని పేర్కొన్నారు. తెలంగాణలో సాగు వనరులు చూసి ఎక్కడెక్కడి నుంచో ఎందరో బతకడానికి వచ్చారని గుర్తుచేశారు. కానీ, వలస రైతులు మనకు వ్యవసాయం చేయడం నేర్పారని పీసీసీ అధ్యక్షుడు పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్ రాజకీయ అపరిపక్వతకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ రైతులు ఆగమయ్యారని, వ్యవసాయ రంగం చితికిపోయిందని స్పష్టంచేశారు. ఈ నిజం మరిచి ఎవ రి మెప్పుకోసమో, ఏ రోటి కాడ ఆ పాట పాడే మహేశ్‌కుమార్‌గౌడ్ అవకాశవాద రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. పీసీసీ చీఫ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను జిల్లాలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు. మంత్రులు తుమ్మల, ఉత్తమ్ నోట అదే అరిగిపోయిన రికార్డు మార్మోగిందని ఎద్దేవా చేశారు.
నిజాంసాగర్ కట్టినప్పుడు ఇక్కడికి ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డరు.. వాళ్లు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు కూడా నేర్పిండ్రు.– పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్