హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకం మే నెలలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ నేపథ్యంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన పదవుల భర్తీలో అనేక సమీకరణాలు ఉన్నాయని, వాటన్నింటినీ బేరీజు వేసుకొని భర్తీ చేయబోతున్నామని చెప్పారు.
క్యాబినెట్ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయని, ఈ అంశం ఏఐసీసీ, ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నట్టు తెలిపారు. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉంటే ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అందువల్లే జాప్యం జరుగుతున్నట్టు చెప్పారు. కులగణనకు అనుగుణంగానే మంత్రివర్గ విస్తరణ జరగాలని పీసీసీ చీఫ్‌గా ఆశిస్తున్నామని తెలిపారు.