హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తేతెలంగాణ): ‘కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేతో బడుగు, బలహీనవర్గాలకు ఒరిగేదేమీలేదని, ఇందులోని లెక్కలను చూస్తుంటే అశాస్త్రీయంగా సర్వే చేసినట్టు అర్థమవుతున్నదని తెలంగాణ మహేంద్ర (మేదరి) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోర్రిగల శ్రీనివాస్ పేర్కొన్నారు. కులాలవారీగా వివరాలు ఇవ్వకపోవడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వేను సవరించాలని, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్టీపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం అంటే మోసం చేసినట్టేనని తేల్చిచెప్పారు. చట్టం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలోని లోపాలు, సరిదిద్దకుంటే ఎదురయ్యే పరిణామాలు, బీసీల విషయంలో సర్కారు అనుసరిస్తున్న నిర్లిప్తవైఖరిని గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎండగట్టారు.
నమస్తే తెలంగాణ: ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన సర్వేతో బీసీలకు ఎంతమేరకు మేలు జరుగుతుంది?
శ్రీనివాస్: కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడతామని ప్రకటించిన తర్వాత ఎంతో సంతోషపడ్డం. మేదరి కులంతోపాటు బీసీలందరి లెక్కలు తేల్చి జనాభాకు అనుగుణంగా నిధులిస్తుందని సంబురపడ్డం. కానీ, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా హడావుడిగా సర్వేచేసి తేల్చిందేమీలేదు. కులాలవారీగా లెక్కలు లేకపోవడంతో కలిగే ప్రయోజనమేమీ ఉండదు. కేవలం బీసీలందరీ వివరాలు ఇవ్వ డం వల్ల ఒనగూరేదేమీ ఉండదు. కులాలవారీగా జనాభాను ప్రకటించి అందుకనుగుణంగా నిధులు కేటాయించాలి.
సర్వే తప్పుల తడకగా జరిగిందని, బీసీల జనాభాను తగ్గించి చూపారని బీసీ సం ఘాల నేతలు, రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మీరు వారితో ఏకీభవిస్తారా?
వంద శాతం ఏకీభవిస్తున్నా. సర్వేలో బలహీనవర్గాల జనాభాను తగ్గించి చూపారు. 2011 జనాభా లెక్కలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చిచూస్తే ఇట్టే అర్థమవుతుంది. దాదాపు 6% అంటే 20 లక్షల జనాభాను తగ్గించి చూపారు. ఎస్సీ, మైనార్టీల సంఖ్యను కూడా తగ్గించారు. విచిత్రంగా ఆగ్రవర్ణాల జనాభా పెరిగినట్టు చూపారు. ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ విధంగా చేసిందని భావిస్తున్నాం.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీపరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనిని మీరు సమర్థిస్తారా?
కాంగ్రెస్‌కు బీసీలంటే మొదటినుంచీ చులకనభావం ఉన్నది. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతోపాటు అనేక హామీలిచ్చింది. వీటిని మాలాంటి బీసీ సంఘాల నాయకులతోపాటు అనేకమంది కొంతమేర విశ్వసించినం. ఇప్పుడు బీసీలకు ప్రత్యేక కోటా సాధ్యం కాదని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం విడ్డూరం. పార్టీపరంగా స్థానిక ఎన్నికల్లో బలహీనవర్గాలకు 42% సీట్లు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. ఇదీ సాధ్యమయ్యే పనికాదు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ అయితే ప్రతిపక్షాలు కూడా 42% కోటా ఇవ్వాలని ఎలా చెప్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టసవరణ చేసి వర్తింపజేయాలి. ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే మోసం చేసినట్టు తేటతెల్లమవుతున్నది.
కాంగ్రెస్ ఏడాది పాలనలో బీసీలకు ఎంతమేర మేలు జరిగింది?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏమాత్రం మేలు జరగలేదు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు మంత్రులకు, అధికారులకు విన్నవించినం. బీఆర్ఎస్ హయాంలో మహేంద్ర సంఘ ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ భగాయత్‌లో కేటాయించిన ఎకరం స్థలంలో భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అనేకసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినం. ఖజనాలో నగదు లేదని తప్పించుకుంటున్నారే తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడంలేదు. కాంగ్రెస్ సర్కారు భవిష్యత్‌లో కూడా ఏమీ చేయదని తెలిసిపోతున్నది.
కేసీఆర్ పదేండ్ల పాలనలో మేదరులకు ఏమైనా న్యాయం జరిగిందా?
తెలంగాణ వచ్చిన తర్వాతే బీసీ ఏ క్యాటగిరీలోని మేదరులకు మేలు జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మా అభివృద్ధికి బాటలు వేశారు. ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ భగాయత్‌లో అత్యంత విలువైన ఎకరం స్థలమిచ్చారు. వెదురు సొసైటీల బకాయిలను రద్దుచేశారు. సుమారు 7,000 మందికి బీసీబంధు కింద రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. వెదురు డిపోల ద్వారా కలప సరఫరాను సులభతరం చేశారు. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ఉన్నాయి.
ప్రభుత్వానికి కులగణనపైమీరిచ్చే సలహాలు,సూచనలేమిటి?
కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగాకులగణన చేపట్టింది. జిల్లాలు, కులాలవారీగా వివరాలు ఇవ్వలేదు. సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సర్వేను సవరించాలి. మిగిలిపోయిన 16 లక్షల మంది వివరాలను సేకరించాలి. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.