తెలంగాణ రాష్ట్రంలో మహిళాభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు మహారాష్ట్ర నారీ లోకాన్ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పేదలు, పీడితులు, అసహాయులు, వితంతువుల సంక్షేమం, స్వావలంబన కోసం పనిచేస్తున్న స్వరాజ్య మహిళా సంఘటన్ను బీఆర్ఎస్లో విలీనం చేశాం.
– వనితా తాయి గుట్టే
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదం మహారాష్ట్రలోని సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ నినాదం మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తి సంఘాలను కదిలిస్తున్నది. అందులో భాగంగా మహారాష్ట్రలోని సకల షెత్కరీ సంఘటన్లు (రైతు సంఘాలు), శంభాజీ బ్రిగేడ్ వంటి సామాజిక సంస్థలు బీఆర్ఎస్కు జై కొడుతున్నాయి. తాజాగా మహిళా సమస్యల మీద పోరాడుతున్న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ మహిళా సంఘం ‘స్వరాజ్య మహిళా సంఘటన్’ బుధవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. ఈ సందర్భంగా కేసీఆర్ స్వరాజ్య మహిళా సంఘట అధ్యక్షురాలు వనితా తాయి గుట్టేతో పాటు సంఘం సభ్యులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళాభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, విధానాలు మహారాష్ట్ర నారీ లోకాన్ని ఆకట్టుకున్నాయని వనితా తాయి గుట్టే అన్నారు. ఈ నేపథ్యంలోనే పేదలు, పీడితులు, అసహాయులు, వితంతువుల సంక్షేమం, స్వావలంబన కోసం పనిచేస్తున్న స్వరాజ్య మహిళా సంఘటన్ బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలను ముందుకు తీసుకుపోవడంలో సీఎం కేసీఆర్ ఆదేశాలను చిత్తుశుద్ధితో పాటిస్తానని చెప్పారు. స్వరాజ్య మహిళా సంఘటనతో పాటు మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పలు పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. బుల్ధానా జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అర్జున్ వాంఖడే, స్టేట్ యూనియన్ వరర్ (సభ్యుడు) రామ్రావ్ షిండే పాటిల్, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భయ్యాసాహెబ్ పాటిల్, పంచాయతీ సమితి సభాపతి సురేశ్ మిస్రవ్, శంభాజీ బ్రిగేడ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అశోక్ మొహాలే, కార్పొరేటర్, ఎన్సీపీ తాలూకా ప్రెసిడెంట్ జయంత్ దరి, మహిళా అఘాడీకి చెందిన మనీషా దరి, మహాగావ్ తాలూకా సభాపతి నరేంద్ర ఖదారే, శివసేన జిల్లా సచివ్ దత్తరాజ్ దేశ్ముఖ్, లాహురావ్ మడే, అషిప్ యాతల్, సునీల్ జాదవ్, సంతోష్ రాథోడ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.