హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ దూకుడును తట్టుకోలేక అక్కడి రాజకీయ దిగ్గజాలు దిగ్గున లేస్తున్నారు. బీఆర్ఎస్పైనా, సీఎం కేసీఆర్‌పైనా అపనమ్మకాలను వ్యాప్తి చేస్తున్నారు. మొన్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్.. నేడు ఆ పార్టీ సీనియర్ నేత అజిత్‌పవార్ కొత్తపల్లవి అందుకున్నారు.
‘దేశ రాజకీయాలను మార్చటానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు లేవు’ అని పేర్కొన్నారు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు నిద్రపట్టకుండా చేస్తున్నదని, అందుకనే మునుపెన్నడూ స్పందించని శరద్‌పవార్, అజిత్‌పవార్ మాట్లాడుతున్నారని మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణను జీర్ణించుకోలేకే నిందలు వేస్తున్నారని మాణిక్ కదం, శంకరన్న, చరణ్ వాగ్మారే మండిపడ్డారు.