Telangana | అటు భయం..
వసతుల లేమి.. ఔషధాల కరువు.. వైద్య సిబ్బంది కొరత.. కరెంటు కోతలు.. వెరసీ 24 గంటల్లో 24 మంది.. 48 గంటల్లో 31 మంది.. 8 రోజుల్లో ఏకంగా 108 మంది మృతి. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో దుస్థితి ఇదీ. అక్కడ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేంతగా…
ఇటు అభయం..
అత్యాధునిక మౌలిక వసతులు.. జిల్లాకో వైద్య కళాశాల.. సూపర్ స్పెషాలిటీ దవాఖానలు.. కార్పొరేట్‌ను తలదన్నే సౌలత్లు. కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ వైద్యం రంగంలో జరిగిన సమూల మార్పులు ఇవీ. ఎంతగా అంటే పక్క రాష్ట్రం మహారాష్ట్ర వాసులు సైతం మన వైద్యాన్ని నమ్మేంతగా.. సరిహద్దులు దాటి తెలంగాణకు వచ్చి వైద్యం చేయించుకునేంతగా…
తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న అత్యాధునిక వైద్య సేవలకు మహారాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ర్టానికి చెందిన అనేకమంది ముఖ్యంగా సరిహద్దులోని నాందేడ్, యావత్మాల్, చంద్రాపూర్, వార్ధా జిల్లాల ప్రజలు వైద్యం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నారు. మహారాష్ట్రలోని సర్కారు దవాఖానల్లో పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌తో పాటు సరిహద్దుల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యశాలను కేసీఆర్ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ దవాఖానగా మార్చింది. ఇక్కడ రోజూ 1,200 మంది వరకు ఓపీ సేవలు పొందుతుండగా, 450 మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. న్యూరో, గుండె సంబంధిత, పీడియాట్రిక్, యూరాలజీ తదితర సేవలతో పాటు అనేక రకాల సౌలత్లు అందుబాటులోకి వచ్చాయి.
మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది అత్యవసర సేవలతో పాటు కాన్పుల కోసం ఆదిలాబాద్‌కు వస్తున్నారు. మాండ్వి, కొటారి, కనిగి, చిట్యాల నాగాపూర్, సిరిపురం, లింగి, గౌరి, హింగన్‌ఘాట్, ఉనికేశ్వర్, పిప్పర్శాండే, రాజంపేట, నారాయణపేట్, కుర్లి, ఉపాసనాల, కానర్గాం, దిగ్రస్, పిప్పల్‌కోటి, పాండ్రకవడ, బోరి, చెనాక, గుబిడి, కారేగాం, జునోని తదితర గ్రామాల మహిళలు మన సర్కారు వైద్యం కోసం వస్తుంటారు. వీరికి రిమ్స్ గైనకాలజీ విభాగంతో పాటు పీహెచ్‌సీల్లో కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందిస్తున్నారు. దీంతో, ప్రతి నెలా 25 నుంచి 30 మంది గర్భిణులు వస్తున్నారు.
మహారాష్ట్రలో రూ.35 వేలు అయినయి
మహారాష్ట్రలో వైద్యసేవలు సరిగా ఉండవు. మా గ్రామంతో పాటుఇతర గ్రామాల ప్రజలు ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానకు వస్తుంటారు. ఇక్కడి డాక్టర్లు మంచిగా చూస్తారు. నా మొదటి కాన్పునకు మహారాష్ట్రలో రూ. 35 వేల వరకు ఖర్చు అయ్యింది. తెలంగాణలో వైద్యం బాగుండటంతో రెండో కాన్పునకు ఆదిలాబాద్ సర్కారు దవాఖానకు వచ్చాను. ఆపరేషన్ చేశారు. కూతురు పుట్టింది. నన్ను, నా బిడ్డను డాక్టర్లు రోజూ వచ్చి చూస్తున్నారు. నయాపైసా ఖర్చు లేకుండా అన్ని ఉచితంగానే అందిస్తున్నారు.
– ఛాయ వివేక్ గౌరి, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర
…?భాకే రఘునాథ్‌రావు