KCR | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణకు అక్కడి రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. అది వ్యక్తి విజయం కాదు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాద బలం. ఈ బలంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేక మంది నాతో సంప్రదింపులు జరుపుతున్నారు. మహారాష్ట్రలో ఏం జరుగబోతున్నదో మీరే చూస్తారు’ అని పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మహారాష్ట్ర ముఖ్యనేతలతో ఆయన సమాలోచనలు చేశారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం అక్కడ పార్టీ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణం తదితర అంశాలను వెల్లడించారు. ఈ నెల 8, 9 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలకు తెలంగాణ భవన్‌లోనే శిక్షణా కార్యక్రమాలుంటాయని చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుంచి జూన్ 10 వరకు మహారాష్ట్రలో గ్రామ గ్రామానికి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. మహారాష్ట్ర భూమి పుత్రులు, ఆరాధ్యులైన ఛత్రపతి శివాజీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కావాలని నిర్దేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో జనాభా ప్రాతిపదికన కమిటీల్లో చోటు కల్పించాలని కోరారు. గ్రామీణ నియోజకవర్గాల్లో జనాభాను బట్టి కమిటీల్లో సంఖ్యను నిర్ణయించుకోవాలని సూచించారు.
వరదలా చేరికలు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనానికి పార్టీలోకి కొనసాగుతున్న వలసలే ఉదాహరణ అని సీఎం కేసీఆర్ చెప్పారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, బ్లాక్ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఇప్పటికే బీఆర్ఎస్లో చేరారని, అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరటానికి సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. అన్ని ప్రాంతాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు తనతో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ ఆత్మైస్థెర్యం, మనోనిబ్బరం, సంకల్పశుద్ధి, చిత్తశుద్ధి మహోన్నతమైనవి. మన లక్ష్యం నుంచి ఎవరూ తప్పుకోవద్దు’ అని కోరారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదం యావత్తు దేశాన్ని ఆలోచింపజేస్తున్నదని చెప్పారు.
తెలంగాణ తరువాత దేశ రాజకీయాలను, ప్రజలను గుణాత్మక మార్పు దిశగా మళ్లించే గొప్ప అవకాశం మహారాష్ట్రకే దక్కిందని తెలిపారు. బీఆర్ఎస్ మహారాష్ట్రలో కాలుమోపగానే కిసాన్ సమ్మాన్ నిధిని అక్కడి ప్రభుత్వం పెంచిందని, ఇప్పుడు తలాటీ (వీఆర్ఏ) వ్యవస్థ రద్దు విషయంలో ఆలోచిస్తుండటం బీఆర్ఎస్ తొలి విజయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేసి తీరతాం అనేందుకు ఈ రెండు విజయాలే నిదర్శమని చెప్పారు. బీఆర్ఎస్ పూర్తిగా కాలుమోపకముందే రెండు అద్భుత విజయాలు సాధిస్తే.. అధికారంలోకి వస్తే ఇంకెన్ని చేయవచ్చో ఆలోచించాలని నేతలకు సూచించారు.
రెండుమూడు రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం
పార్టీ విస్తరణలో మహారాష్ట్రలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిల నియామకం దాదాపు పూర్తయిందని, రెండుమూడు రోజుల్లో జిల్లా సమన్వయకర్తల నియామకం పూర్తవుతుందని సీఎం చెప్పారు. ‘వ్యక్తులు ముఖ్యం కాదు. పార్టీ ముఖ్యం అనే సిద్ధాంతం బీఆర్ఎస్కు ఆయువుపట్టు. పార్టీ నిర్ణయాలను, సిద్ధాంతాలను నేతలు, క్యాడర్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని సూచించారు.

Cmkcr5
పక్కాగా సంస్థాగత నిర్మాణం
ఒకే రోజు ఒకే సమయంలో 288 నియోజకవర్గ కేంద్రాల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల మార్పు… ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పునకు శ్రీకారం చుడుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని సూచించారు. 8, 9 తేదీల్లో నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులకు తెలంగాణ భవన్లో శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని, శిక్షణ పూర్తికాగానే నియోజకవర్గాలవారీగా అవసరమైన పార్టీ ప్రచార సామగ్రిని ‘జై మహారాష్ట్ర’ అనే నినాదంతో పట్టుకెళ్లాలని సూచించారు. ఈ నెల 10 నుంచి జూన్ 10 వరకు పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి కావాలని ఆదేశించారు. శివాజీ, అంబేద్కర్ విగ్రహాల నుంచే ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున మొత్తం 288 వాహనాలు దాదాపు 10 లక్షల కిలోమీటర్లు తిరగనున్నాయని, ఇంతదూరం బీఆర్ఎస్ తన నినాదాన్ని వినిపిస్తే మహారాష్ట్ర రాజకీయాల్లో రీ సౌండ్ తప్పదని పేర్కొన్నారు.
క్రియాశీల సభ్యులే పదవులకు అర్హులు
పార్టీ సాధారణ సభ్యత్వానికి రూ.10, క్రీయాశీల సభ్యత్వానికి రూ.50 స్వీకరించాలని సీఎం కేసీఆర్ సూచించారు. బలవంతపు సభ్యత్యం తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఎక్కడో ఆఫీసుల్లో కూర్చొని సభ్యత్వం చేయకూడదని, పార్టీ సిద్ధాంతం, ప్రయాణం, విజన్‌ను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి ఇచ్ఛాపూర్వకంగానే తీసుకోవాలని పేర్కొన్నారు. పార్టీ నియమావళి ప్రకారం క్రియాశీల సభ్యత్వం తీసుకొన్నవారికే సర్పంచ్ మొదలు ఎంపీ వరకు అన్ని స్థాయిల పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. జిల్లా సమన్వయకర్తలు, వారి పరిధిలో ఉండే నాయకులు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదుపై దృష్టి కేంద్రీకరించాలని, ఏ రోజుకారోజు సభ్యత్వ వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆదేశించారు. సంస్థాగత నిర్మాణంలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ కమిటీలు, పట్టణ/నగర ప్రాంతాల్లో వార్డు కమిటీలు.. రైతు, ఎస్సీ, ఎస్టీ, యువజన, మహిళా, విద్యార్థి సహా 9 పార్టీ అనుబంధ కమిటీలు వేయాలని, ప్రతీ కమిటీలో ఆయా ప్రాంతాల జనాభాకు అనుగుణంగా సభ్యుల సంఖ్యను నిర్ణయించుకోవాలని సూచించారు.
పార్టీ కార్యాలయాలే నిర్దేశిత కేంద్రాలు
మహారాష్ట్రలో పార్టీ శాశ్వత కార్యాలయాల ఏర్పాటు బాధ్యత పార్టీ చూసుకొంటుదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ నెల 4న ఢిల్లీలో పార్టీ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం తాను బుధవారం ఢిల్లీకి వెళుతున్నట్టు వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఢిల్లీ వెళ్లినా, హైదరాబాద్ వచ్చినా పార్టీ కార్యాలయాల్లో వారికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
బీఆర్ఎస్లో చేరికలు
కేసీఆర్ సమక్షంలో మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలు పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరారు. యవత్మాల్ మాజీ ఎమ్మెల్యే రాజు తోడసం, జడ్పీ మాజీ వైస్ చైర్మన్లు పవన్ తిజారే, గంగాధర్ పాటిల్ చాబ్రేకర్, ఆదివాసీ సంఘం అధ్యక్షుడు సూరజ్ ఆత్రం, దళిత సంఘాల జిల్లా అధ్యక్షుడు అరవింద్ గోటేకర్, రైతు నాయకుడు శివానంద్, అమరావతి జిల్లాకు చెందిన నాయకుడు జగదీశ్ నానా బోండే , శివసేన యూత్ వైస్ ప్రెసిడెంట్ మహేశ్ ముండే, అజయ్ తిజారే, ధనంజయ్ పాటిల్, ప్రఫుల్ల తదతరులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పీయూసీ చైర్మన్ జీవన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ జీ నగేశ్, మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు మాణిక్ కదం, శంకరన్న దోండ్గే, మాజీ ఎంపీ హరిబావ్ రాథోడ్, సుధీర్ సుధాకర్‌రావ్ బిందు, సువర్ణ కాటే బగల్, తదితరులు పాల్గొన్నారు.
పదవులకన్నా కర్తవ్యం మిన్న
మహారాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని, అదే క్రమంలో పేదరికం, సమస్యలతో సతమతమవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలకు సేవచేసే అవకాశం అందరికీ రాదని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రజల ప్రేమకు పాత్రులైతే జీవితం ధన్యమవుతుందని పేర్కొన్నారు. పీడితులు, వంచితుల పక్షాన నిలబడి పోరాటం చేసినవారే చరితార్థులుగా మిగిలిపోతారని, పదవులు రాగానే కండ్లు నెత్తిన పెట్టుకొని ఆకాశంలో తేలియాడితే అథోగతి పాలవుతారని హెచ్చరించారు. ‘పదవులు (పార్టీ పదవులైనా.. ప్రజాప్రతినిధులైనా) వచ్చేదాకా పాదాలు పట్టుకొని ప్రార్థించి.. పదవులు రాగానే కండ్లు నెత్తికెక్కే దుస్థితి బీఆర్ఎస్లో లేదు. ఈ విషయంలో పార్టీ చాలా సీరియస్‌గా ఉంటుంది’ అని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సిద్ధాంతాన్ని, లక్ష్యాన్ని ప్రజలకు చేర్చి వారి ప్రేమను పొందాలని సూచించారు. ప్రజల మనసులు గెలవడం బీఆర్ఎస్ లక్ష్యమని, ఈ క్రమంలో వ్యక్తిగత రాగద్వేషాలకు తావు ఇవ్వకూడదని హితవు పలికారు.

Cmkcr1