ముంబై: తెలంగాణలో రూ.19 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయంపట్ల మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్‌సెల్ (BRS Kisan Cell) అధ్యక్షుడు మాణిక్ కదం (Manik Kadam) హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని మరోసారి నిరూపించారన్నారు. రైతులకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. అందువల్లే తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని వెల్లడించారు. అందుకే యావత్‌దేశం ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ఆబ్‌కి బార్ కిసాన్ అని నినదిస్తున్నదని చెప్పారు.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంటరుణాల మాఫీని పూర్తిచేయనున్నట్టు సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. రూ.లక్షలోపు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని 2014లో ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ తు.చ తప్పకుండా నెరవేర్చారు. 2018లో మరోసారి రుణమాఫీ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పటికే రూ. 36 వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. తాజాగా మిగిలిన రుణాల మాఫీకి పచ్చజెండా ఊపారు. రుణమాఫీ పున:ప్రారంభ ప్రక్రియ గురువారం నుంచే ప్రారంభించాలని, మొత్తం రుణాలను 45 రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. రుణాల చక్రబంధంలో ఇరుక్కొని రైతులు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. అందుకే రైతులను రుణ విముక్తి చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పంట రుణాల మాఫీని అమలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి ఎన్నికల్లోనే రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి విడత ప్రభుత్వంలో మొత్తం 35.31 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేశారు. దీంతో సీఎం కేసీఆర్ తమకు ఇంకా మంచి చేస్తారని నమ్మిన రైతులు, ప్రజలు మరోసారి ఆయనకు పట్టంకట్టారు.
ఆ నమ్మకాన్ని సీఎం కేసీఆర్ కూడా వమ్ము చేయలేదు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకొనేలా 2018 ఎన్నికల సమయంలోనూ మరోసారి రూ.లక్ష వరకు పంట రుణాల మాఫీకి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటివరకు రెండు విడతల్లో రూ.36 వేలలోపు గల రైతుల రుణాలను మాఫీ చేశారు. 5.42 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 1,207.37 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిం ది. మిగిలిన రుణాలకు సంబంధించి మాఫీ చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈసారి సుమారు 29.61 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనున్నది. తొలి రెండు దఫాల్లో మొత్తం 40.74 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.17,351 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. తాజా రుణమాఫీని కూడా కలిపితే ఇది సుమారు రూ.36 వేల కోట్లకు చేరనున్నది. తాజా రుణమాఫీతో సుమారు 29.61 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. రైతులు బ్యాంకుల్లో తీసుకొన్న రూ. లక్షలోపు పంట రుణాలు పూర్తిగా మాఫీ కానున్నాయి.