ఆదిలాబాద్/జహీరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్తరించాలని కోరుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న శుక్రవారం ప్రచారం నిర్వహించారు. జిల్లా నాయకులతో కలిసి రాజూరా నియోజకవర్గంలో పర్యటించారు.
రాజూరా స్వతంత్ర భారత పక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వామన్రావ్ శతప్తో పాటు పలువురు నాయకులు, ప్రజలతో సమావేశమయ్యారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు రైతులు, ఇతర వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని, తెలంగాణ పథకాలను వారు కోరుకుంటున్నారని జోగు రామన్న తెలిపారు. బీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు, స్థానికులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్ ఉన్నారు.
కర్ణాటకలో బీఆర్ఎస్కు జై
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డీ లక్ష్మారెడ్డి, సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్‌కుమార్ శుక్రవారం కర్ణాటకలోని చించోళీ తాలూకాలో పర్యటించారు. పలు పార్టీలకు చెందిన నాయకులతో వారు సమావేశాలు నిర్వహించారు. చించోళీ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, మాజీ పంచాయతీ చైర్మన్ ఉమాపతి, యాద్గిర్ జిల్లా మాజీ జిల్లా యూత్ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ, చించోళీ తాలూకా బీజేపీ నాయకుడు, మాజీ పంచాయతీ చైర్మన్ జయప్రకాశ్‌తో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి, ఢిల్లీ వసంత్‌కుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతమైన బీదర్, కలబురగి, యాద్గీర్, రాయచూర్ జిల్లాలో బీఆర్ఎస్ను సంస్థాగతంగా నిర్మించేందుకు కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. తెలంగాణలోని సంక్షేమ పాలనను చూసి తమను కూడా తెలంగాణలో కలపాలని గతంలో హైదరాబాద్-కర్ణాటక (హైకా) ప్రజలు, నేతలు విజ్ఞప్తి చేసిన విషయం గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వీరంతా బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు.