BRS | మహబూబాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లగచర్లలో దళిత, గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తున్నది. ఇప్పటికే లగచర్ల గిరిజన రైతులు, బాధితులతో కలిసి కేటీఆర్, గిరిజన ప్రజాప్రతినిధులు మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇతర ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లొచ్చారు. దళిత, గిరిజనులపై జరిగిన దాడులను అకడ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా గిరిజన రైతులు, ప్రజలు ఎకువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో సోమవారం మహాధర్నా నిర్వహించేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది.
ముందుగా ఈ నెల 21న మహాధర్నా నిర్వహించాలని పార్టీ తలపెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించేలా చేసింది. దీంతో జిల్లా నేతలు హైకోర్టును ఆశ్రయించి ఈనెల 25న మహా ధర్నా నిర్వహించేందుకు అనుమతి పొందారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానుండటంతో బీఆర్ఎస్ నాయకులు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు మానుకోటకు చేరుకొని, లగచర్లలో రైతులపై జరిగిన దాడిపై సర్కార్‌ను నిలదీయనున్నారు. ధర్నా నిర్వహించే ప్రాంతాన్ని ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు సత్యవతిరాథోడ్, తకళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్ పరిశీలించారు.