మహబూబాబాద్ : మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేంద్రం పోలీసుల దిగ్బధంలోకి(Police blockade) వెళ్లిపోయింది. మానుకోట పట్టణంలో పోలీసుల కవాతుతో భయానక వాతావరణం నెలకొంది. ఎటు చూసినా పోలీసులతో పట్టణం ఖాకీ వనంలా మారిపోయింది. నేడు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిం చే గిరిజన రైతు ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇతర మండలాల నుంచి జిల్లా కేంద్రంలోకి ఎవరు రాకుండా పోలీసులు భారీ కేడ్లు పెట్టి వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పట్టణ కేంద్రంలో అన్ని వీధుల్లో జిల్లా ఎస్పీ సుదీర్ రామనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసుల బలగాలు కవాతు నిర్వహించాయి. కాగా, లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ ఆందోళనలకు పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని నిర్ణయించగా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రజా పాలనలో కనీసం ధర్నా చేయడానికి కూడా అనుమతించని ప్రభుత్వ తీరుపై పౌర సమాజం భగ్గుమంటున్నది. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు.