దంతాలపల్లి, మే 12 : కాంటాలు పెట్టిన బస్తాలను మిల్లుకు తరలించడం లేదంటూ ఓ రైతు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. మండలంలోని కుమ్మరికుంట్లకు చెందిన ఎండీ యాకూబ్ 38 రోజుల క్రితం వరి కోసి గ్రామంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోశాడు. పూర్తిస్థాయిలో ఆరబెట్టిన తరువాత తేమశాతం వచ్చినా తన వడ్లు కాంటాలు పెట్టకుండా పలుకుబడి ఉన్నవారివి ముందు కాంటాలు పెట్టారని గతంలో కూడా నిర్వాహకులతో గొడవపడ్డాడు.
ఆ తర్వాత 354 బస్తాలను కాంటాలు పెట్టారు. (దొడ్డు,సన్న రకం) మిల్లులకు తరలించే విషయంలో కూడా క్రమ పద్ధతిని పాటించకుండా నిర్వాహకులు తమకు ఇష్టం ఉన్నవారి బస్తాలు లోడ్ చేస్తుండగా వారిని నిలదీశాడు. ఎమ్మెల్యేకు చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని నిర్వాహకులు దురుసుగా మాట్లాడటంతో మనస్తాపానికి గురైన యాకూబ్ కొనుగోలు కేంద్రం వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోగా గమనించిన స్థానికులు అడ్డుకొని నచ్చజెప్పారు. ఆ తర్వాత యాకూబ్ బస్తాలను మిల్లుకు తరలించారు.