Telangana | గార్ల, జూలై 16: కట్టుకున్న తోడు కాలం చేయగా.. కన్న కొడుకులు కాదు పొమ్మన్నా రు. కనిపెంచిన మమకారాన్ని మరిచి కొట్టి ఇంటి నుంచి గెంటేశారు. ఒంటిమీదున్న నగ లు, ఉన్న భూమిని లాక్కొని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు. ఇప్పటిదాకా.. ఊర్లో ఆత్మగౌరవంతో బతికిన ఆ వృద్ధురాలు.. నేడు దిక్కుతోచని స్థితిలో యాచిస్తూ పొట్టపోసుకుంటున్నది. కొడుకులు, కోడండ్లు ఉన్నా ఒంటరైంది. ఆస్తిపాస్తులున్నా నిలువనీడ కరువైంది.
అందరూ ఉన్న అనాథగా మిగిలిపోయానని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నది మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని జెండాల బజార్‌కు చెందిన గాడెపల్లి నర్సమ్మ(78). గాడెపల్లి రామయ్య-నర్సమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు శ్రీను, రాజేశ్, కృష్ణ ఉన్నారు. వారిని చదివించి అందరికీ పెండ్లిళ్లు చేశారు. తండ్రి రామయ్య మృతి చెందగా.. తల్లి నర్సమ్మ ఒంటరైంది. వృద్ధాప్యంలో ఉన్న నర్సమ్మ బాగోగులు చూసుకోవాల్సిన ముగ్గురు కొడుకులు..
ఆమెను కొట్టి బంగారు నగలు లాక్కొని ఇంటి ఉంచి వెళ్లగొట్టారు. దిక్కుతోచని స్థితిలో నర్సమ్మ గార్ల పట్టణంలో భిక్షాటన చేస్తూ కడుపు నింపుకొంటున్నది. ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ.. మూడు ఎకరాల భూమిని ముగ్గురు కొడుకులు పంచుకున్నారని, నెలకు ఒక కొడుకు తన పోషణ చూడాలని గతంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా అందరూ ఒప్పుకొన్నారని తెలిపింది. రెండో కుమారుడు రాజేశ్ తన బంగారు ఆభరణాలు తీసుకుని కొట్టి బయటకు పంపించినట్టు కన్నీరుమున్నీరైంది. తనకు ఉన్న ఒక్క గదిని కూడా కూల్చేశారని, తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నది.