Congress Rebels | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పుంజుకుంటున్నది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనలో ప్రచారంలో ముందంజలో నిలిచింది. కానీ తామే ప్రత్యామ్నాయం అంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీల్లో అసమ్మతి కుమ్ములాటలు బయట పడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టికెట్లు రాని కాంగ్రెస్ నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. ఏడు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ, పార్టీ నాయకత్వం తీరుపై తిరుగుబాట్లకు సిద్ధం అవుతున్నారు టికెట్ రాని నేతలు.. ఆ జాబితాలో కొల్లాపూర్,కల్వకుర్తి, నాగర్ కర్నూల్, గద్వాల నేతలు ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులుగా గానీ, స్వతంత్ర అభ్యర్థిగా గానీ బరిలో నిలవాలని తలపోస్తున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లి క్రుష్ణారావుకు కొల్లాపూర్ టికెట్ కన్ ఫర్మ్ చేసింది ఆ పార్టీ అధిష్టానం. దీనిపై స్థానిక నేత జగదీశ్వర్ రావు సోమవారం తన అనుచరులతో జరిగిన భేటీలో మాట్లాడుతూ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని కుండబద్ధలు కొట్టారు.
ఇక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించడంతో గద్వాలకు చెందిన టీపీసీసీ కార్యదర్శి కురవ విజయ్ కుమార్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. త్వరలో విజయ్ కుమార్, ఇతర నేతలు సమావేశమవుతారని, రెబల్ అభ్యర్థిగా నిలబడాలని తలపోస్తున్నారు.
మరోవైపు, సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తాను గానీ, తన కొడుకు గానీ నాగర్ కర్నూల్ సీటు నుంచి పోటీ చేయాలని తలపెట్టారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు చాన్స్ ఇవ్వక పోవడంతో రగిలిపోతున్నారు. తనకు టికెట్ రాకున్నా.. పల్లెలకు వెళ్లి ప్రచారం చేస్తానని తేల్చి చెప్పారు నాగం. ఇక కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించిన ఎన్నారై రాఘవేందర్ రెడ్డి కూడా తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు వినికిడి. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగినా ఫలించలేదని సమాచారం.