మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరాలయంలో (Kaleshwaram) గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి త్రివేణి సంగమం.. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవ మహా ఘట్టం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 42 ఏండ్ల తర్వాత మహా కుంభాభిషేక మహాక్రతువుకు వేదికయింది. గంగా యమునా సరస్వతి సంఘమైన ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళ జరుగుతున్న తరుణంలోనే కాళేశ్వరలో త్రివేణి సంగమంలో మహాకుంభాభిషేక ఘట్టం ఆవిష్కృతమైంది.
ఆదివారం ఉదయం సరిగ్గా 10.42 గంటల సుముహూర్తాన మహా కుంభాభిషేక ఘట్టానికి రుత్వికులు శ్రీకారం చుట్టారు. 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగిన క్రతువులో 3వ రోజు కుంభాభిషేక మహోత్సవ ఘట్టంలో భాగంగా విశేష పూజలు చేశారు. శత చండీ పారాయణం, సహస్రఘటాభిషేకం తదితర ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారికి సహస్ర ఘటాలతో విశేష అభిషేకాన్ని ఘనంగా జరిపారు. ఆదివారం ఉదయం 10 గంటల 42 నిమిషాలకు వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య శృంగేరి పీఠానికి సంబంధించిన తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతిచే కుంబాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు హాజరయ్యారు.
కాలేశ్వరంలో మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కాలేశ్వరం ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో విశేష పూజలు చేశారు.