కవాడిగూడ, ఏప్రిల్ 29: రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోతుల నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీజీఈజేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సీఐటీయూ నాయకుడు వీఎస్ రావు, సీనియర్ నాయకులు ఎంఎన్ రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాలను పనిచేయనివ్వకుండా కేంద్రం అడ్డుకుంటున్నదని ఆరోపించారు. సీపీఎస్ రద్దుపై రాష్ర్టాలను మాట్లాడకుండా చేస్తున్నదని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా భావావేశాలు రెచ్చగొట్టే పనులను మానుకోవాలని హితవుపలికారు. ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ నాయకుడు వీఎస్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు కార్పొరేట్లు, కాంట్రాక్టర్ల కోసమే పనిచేస్తున్నాయని, ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సంక్షేమం కోసం పనిచేయడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని, గద్దె దించే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. పోతుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ నాయకులు కృష్ణమూర్తి, ఎం నరహరి, డాక్టర్ ఎల్ అరుణ, కమలకుమారి, సీతారాం, ప్రభాకర్ నాయర్, మచ్చా రంగయ్య, కే నాగేశ్వర్రావు, స్వరాజ్‌కుమార్, జనార్దన్, నర్సింగ్‌రావు, రామారావు, రమేశ్, రాధాకృష్ణ, శ్యాంసుందర్, కృష్ణమోహన్, అశోక్ పాల్గొన్నారు.