హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) /బంజారాహిల్స్/ కొండాపూర్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. మాదాపూర్‌లోని స్వగృహంలో గురువారం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబసభ్యులు ఏఐజీ దవాఖానలో చేర్చి మూడురోజులుగా చికిత్స అందించారు. పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మాగంటి పార్థివదేహానికి అన్ని పార్టీల నేతలు, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు మాగంటి నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. గోపీనాథ్ పార్థివదేహాన్ని చూసేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, బస్తీవాసులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. 15 ఏండ్లుగా తమకు అండగా నిలిచిన నేత దూరమవ్వడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
మాగంటి పార్థివదేహాన్ని దవాఖాన నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ముందుండి పర్యవేక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యేదాకా మాగంటి నివాసం వద్దనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ వెన్నంటే ఉన్నారు.
అంత్యక్రియల్లో పాల్గొని మాగంటి పాడెను కేటీఆర్, హరీశ్‌రావు మోశారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలకు తీసుకొచ్చే క్రమంలో అన్ని కార్యక్రమాలను ముందుండి జరిపించారు. ప్రముఖులు, రాజకీయ నేతలు వచ్చివెళ్లేందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేయించారు. అంతకుముందు దవాఖానలోనూ మాగంటికి మూడు రోజుల పాటు చికిత్స అందుతున్న తీరుపై వైద్యులను ఎప్పటికప్పుడు ఆరా తీశారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు నివాళులర్పించేలా ఏర్పాట్లు చేయించారు.
అశేషంగా తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య మాగంటి అంతిమయాత్ర కొనసాగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు మాదాపూర్‌లోని నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం.45 మీదుగా ఫిలింనగర్, జూబ్లీహిల్స్ రోడ్ నం. 78 మీదుగా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం దాకా యాత్ర కొనసాగింది. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి వందనం సమర్పించారు. సాయంత్రం 3.55 గంటలకు మాగంటి తనయుడు వాత్సల్యనాథ్ చేతులమీదుగా అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, నామా నాగేశ్వర్రావు, నల్లమోతు భాస్కర్‌రావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాగంటితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా జీవించారని నెమరేసుకున్నారు. మాగంటి అంత్యక్రియల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కవిత, దాసోజు శ్రవణ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, సురేశ్‌రెడ్డి, ఈటల రాజేందర్, కే లక్ష్మణ్, వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,
ఏపీ మంత్రి లోకేశ్ దంపతులు, కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, పద్మారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాధవరపు కృష్ణారావు, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్, దానం నాగేందర్, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు, అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, రావెల కిషోర్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు మర్రి జనార్దన్‌రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, గజ్జెల నగేష్, రావుల శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, సినీ ప్రముఖులు మురళీమోహన్, ప్రసన్నకుమార్, జీవితరాజశేఖర్, కేఎల్ నారాయణ పాల్గొన్నారు.
మాగంటి గోపీనాథ్ 1963, జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో జన్మించారు. 1980లో ఇంటర్, 1983లో ఓయూ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఆయనకు సునీతతో వివాహం జరిగింది. వారికి కుమారుడు వాత్సల్యనాథ్, కూతుర్లు అక్షర నాగ, దిశిర ఉన్నారు. గోపీనాథ్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది జూబ్లీహిల్స్ ప్రజల్లో ‘గోపన్న’గా చెరగని ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి తిరుగులేకుండా ఎదిగారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (హుడా) డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు.
1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డిపై 16,004 ఓట్లతో గెలిచారు. 2018లోనే శాసన సభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు.
గోపీనాథ్ పార్థివదేహాన్ని చూడగానే కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. మాగంటి కుమారుడిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. గోపీనాథ్ సతీమణి, కుమార్తె, కుటుంబ సభ్యులను ఓదార్చారు. హూందాతనానికి మారుపేరుగా నిలిచిన మాగంటి దూరమవడంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని, జూబ్లీహిల్స్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ నేతగా తనదైన స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు, మాగంటి గోపీనాథ్ కుమారుడు వాత్సల్యనాథ్ వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచీ మిత్రులు కావడంతో మాగంటి దవాఖానలో చేరినప్పటి నుంచి తల్లి శైలిమతోపాటు అక్కడే ఉండి మాగంటి కుటుంబానికి హిమాన్షు అండగా ఉన్నారు. ఉదయం నుంచి దహన సంస్కారాలు పూర్తయ్యేదాకా వాత్సల్యనాథ్కు తోడుగా ఉన్నారు. హిమాన్షుతో పాటు తన మిత్రులు కూడా వచ్చి వాత్సల్యనాథ్కు సానుభూతి తెలిపారు.