మాగనూరు, జూన్ 27 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధంకాగా గ్రామస్థులు అడ్డుకున్నారు. పెద్దవాగు నుంచి ఇసుక తరలించొద్దని శుక్రవారం ఉదయం గ్రామస్థులంతా కలిసి తహసీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.
మధ్యాహ్నానికే ఎలాంటి అనుమతులు లేకుండా రాఘవ కంపెనీ టిప్పర్లు వచ్చి, వాగులోకి వెళ్లేందుకు రోడ్డువేసే చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకొన్న మాగనూరువాసులు, నాయకులు అక్కడికి రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఎస్సై అశోక్బాబు పనులను అడ్డుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. స్థానికులు ఇసుకతరలింపునకు ఒప్పుకోకపోవడంతో టిప్పర్లు వెనుదిరిగాయి.