Maganoor | మక్తల్, నవంబర్ 22 : నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మూడ్రోజులుగా ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతున్నది. బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా గురువారం కలెక్టర్‌తోపాటు అధికారులు పాఠశాలకు వచ్చి నాణ్యమైన భోజనం అందించాలని సూచించినా పురుగుల అన్నం వడ్డించారు. తాజాగా శుక్రవారం పాఠశాలకు ఎమ్మెల్యే వస్తున్నారంటూ విద్యార్థులకు పస్తులు ఉంచడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇలా.. మాగనూరు ఉన్నత పాఠశాలలో శుక్రవారం అధికారుల ఎదుటే సాంఘిక సంక్షేమ వసతి గృహం వంట సిబ్బంది మధ్యాహ్న భోజనాన్ని వండారు.
అంతా సిద్ధం చేసినప్పటికీ మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి వస్తున్నారు.. అప్పటివరకు విద్యార్థులకు భోజనం పెట్టొద్దని కాంగ్రెస్ నాయకులు హడావిడి చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనం పెట్టాల్సి ఉండగా.. ఇంకా రాలేదు.. దగ్గర్లోనే ఉన్నారు.. వస్తున్నారు.. అంటూ తమ నేత మెప్పు కోసం తాపత్రయపడ్డారు. విద్యార్థులను వదలకుండా తరగతి గదుల్లోనే ఉంచడంతో వారు ఆకలితో అలమటించారు.
ఒంటిగంట సమయంలో ఎమ్మెల్యే పాఠశాలకు చేరుకొన్నారు. ఆఫీస్ రూంలో ఉన్న అదనపు కలెక్టర్ వెంటనే బయటకొచ్చి ఎమ్మెల్యేతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు సమయానికి భోజనం పెట్టారా? లేదా? అని కనీసం పరిశీలించలేదు. విద్యార్థులకు సమయానికి అన్నం పెట్టాల్సిందిపోయి ఎమ్మెల్యే మెప్పుకోసం కాంగ్రెస్ నాయకులు పాకులాడటం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మక్తల్/ఊట్కూరు, నవంబర్ 22 : మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడం, అన్నంలో పురుగుల రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఇండ్ల నుంచే భోజనం పంపిస్తున్నారు. శుక్రవారం చాలా మంది పిల్లలు ఇంటి భోజనమే తిన్నారు.
ఫుడ్‌పాయిజన్ నేపథ్యంలో ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడంతో తపస్ ఆధ్వర్యంలో కృష్ణ, మక్తల్, ఊట్కూరులో ఉపాధ్యాయులు శుక్ర వారం నిరసన చేపట్టారు.