హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు.. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడు మడావి హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్త నిజం కాదని, తెలంగాణ, మధ్యప్రదేశ్ పోలీసులు శుక్రవారం ధ్రువీకరించారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ ప్రాంతానికి చెందిన మడ్కం హిడ్మా అలియాస్ చైతూ అని మధ్యప్రదేశ్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. అతనిపై మధ్యప్రదేశ్లో రూ.3 లక్షలు, ఛత్తీస్గఢ్లో రూ.5లక్షలు, మహారాష్ట్రలో రూ.6 లక్షల రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చీఫ్గా ఉన్న మడావి హిడ్మా.. వ్యూహరచనే విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఎన్కౌంటర్లోనూ తాను చనిపోయినట్టు మీడియాకు లీకులు ఇవ్వడం.. ఆ తర్వాత పోలీసులతో ప్రకటన ఇప్పించుకోవడం హిడ్మా ప్రత్యేకత. హిడ్మా స్కెచ్ వేస్తే.. భదత్రా దళాలల్లో జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందనేది పోలీసులకు సైతం తెలిసిన నిజం. తన వ్యూహాల వల్లే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడని అంటుంటారు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ర్టాలు వారు అధికంగా ఉంటే.. సుక్మా నుంచి ఈ స్థానం దక్కించుకున్న వ్యక్తి హిడ్మా అని తెలుస్తున్నది.