హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సోమవారం వివిధ రాష్ర్టాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ను కలిసి సమాలోచనలు జరిపిన వారిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్ మేనల్లుడు సంజయ్యాదవ్, ఆ రాష్ట్ర రేవా మాజీ ఎంపీ బుద్సేన్ ఉండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. మరోవైపు మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ప్రతాప్ నలవాడే, కల్యాణి డోంబివిలీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ రమేశ్‌జాదవ్, ముంబై కార్పొరేటర్లు కల్యాణ్ గైక్వాడ్, సందీప్జాదవ్, దినేశ్జాదవ్, హల్దార్ జిల్లాకు చెందిన సర్పంచ్ సంఘటన్ అధ్యక్షుడు శ్యామ్భవర్ తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై హర్షం వ్యక్తంచేశారు.
మహారాష్ట్రలోనూ తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని, హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేదర్ విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, ఇది దేశకీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేస్తున్నదని రమేశ్ జాదవ్‌తోపాటు పలువురు దళిత నేతలు పేర్కొన్నారు. ప్రగతి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మరికొద్ది రోజుల్లో తమ సహచరులు, అనుచరులతో పెద్దఎత్తున వచ్చి బీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తామని, కేసీఆర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగస్వాములమవుతామని ముంబైకి చెందిన దళిత రాజకీయ నేతలు చెప్తున్నారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అయినవారిలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ప్రముఖ నేతలు మాణిక్ కదం, విజయ్‌దేశ్‌ముఖ్, ఎమ్మెల్యేలు బాల సుమన్, జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Cm