తెలుగు యూనివర్సిటీ, జూన్ 30 : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువులను దూరం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని శాసనమండలి విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి తెలిపారు. పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2న చేపట్టిన కళాశాలల బంద్ పోస్టర్‌ను మంగళవారం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి ఒంటెత్తు పోకడలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిపెట్టి విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలను అడ్డుకోవాలని కోరారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి, గత 30 మాసాలుగా చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నట్టు తెలిపారు. బీసీ జేఏసీ చేపట్టిన కళాశాలల బంద్‌కు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సిరికొండ తెలిపారు.
బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలు విడుదల చేయకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రలు పన్నుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయం మొత్తం బడా కాంట్రాక్టర్లకు దోచిపెడుతుందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. జూలై 2న కళాశాలలు బంద్ పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయని పక్షంలో జూలై 15న చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. సీపీఐ సీనియర్ నాయకుడు అజీజ్‌పాషా మాట్లాడుతూ.. జేఏసీ చేపట్టిన కార్యక్రమాలకు సీపీఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ నేతలు కృష్ణ, శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, లింగంగౌడ్, శ్యామ్, నరేశ్, భాస్కర్, తారకేశ్వరి పాల్గొన్నారు.