హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యంలో అణచివేతలకు ఆస్కారమే లేదని, బెదిరింపులు, భయభ్రాంతులకు తావులేదని మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి అన్నారు. డిమాండ్ల పరిష్కారానికి చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచులను అరెస్ట్ చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ బృందంతో కలిసి వెళ్లిన మాజీ స్పీకర్ మధుసూదనచారి మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉన్నత స్థాయికి చేరితే… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే… మళ్లీ తిరోగమన స్థితికి చేరిందని విమర్శించారు. మానవ దృక్పథంతో స్పందించాల్సిన ప్రభుత్వం మాజీ సర్పంచుల సమస్యలను పరిష్కరించకుండా మొండిగా వ్యవహారిస్తుందని మండిపడ్డారు. సమస్య పరిష్కారాన్ని విస్మరించి, గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ దుర్మార్గ చర్యలను ఎండగడతామని చెప్పారు. సర్పంచుల సమస్యలు పరిష్కరమయ్యేంత వరకు బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని తెలిపారు. మాజీ సర్పంచులను తక్షణమే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.