Chinna Kaleshwaram | మహదేవపూర్, జనవరి 11 : రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటే ఊరుకునేది లేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. మెరుగైన పరిహారం ఇవ్వకుండా భూములు తీసుకుంటే రైతుల గతేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎల్కేశ్వరం, సూరారం గ్రామాల్లో పర్యటించారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా భూములు కోల్పోతున్న బాధిత రైతులతో మాట్లాడారు. పరిహారం చెల్లించకుండా రైతుల భూములు లాక్కొని చేపట్టిన కెనాల్ ట్రెంచ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో ఎంత మేర భూములు కోల్పోతున్నారు.. ఎంతమంది రైతులకు పరిహారం అందలేదనే విషయాన్ని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ.. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రైతుల భూములను పోలీస్ బందోబస్తుతో అక్రమంగా లాక్కొని పనులు చేపట్టడం దారుణమని అన్నారు. రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా కెనాల్ ట్రెంచ్ పనుల కోసం పంటలను ధ్వంసం చేయడమేంటని మండిపడ్డారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు మెరుగైన నష్టపరిహారం చెల్లించడంతోపాటు ధ్వంసమైన పంటలకు సైతం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో భూములను కోల్పోయిన రైతులకు తగిన విధంగా న్యాయం చేశామని గుర్తుచేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు సాగారని, రైతుల కళ్లల్లో ఆనందం కోసం నిరంతరం శ్రమించిన విషయాన్ని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల సమయంలో చిన్నకాళేశ్వరం ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు మెరుగైన పరిహారం చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపర్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలో వచ్చిన తర్వాత మరిచిపోయిందని మండిపడ్డారు. చిన్నకాళేశ్వరం భూనిర్వాసితులకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అధికారులు, కాంగ్రెస్ నాయకులు రైతులను, ప్రజలను అనేక రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
రైతులకు పరిహారం ఎక్కువ ఇప్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధికారంలోకి రాగానే విస్మరించారని మండిపడ్డారు. పరిహారం రాలేదని బాధిత రైతులు రోదిస్తున్నా మంత్రి శ్రీధర్‌బాబు కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయం జరిగే వరకు బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.