హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్‌గౌడ్, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, రాజీవ్ సాగర్, పురుషోత్తం, మాధవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ బీసీలను మభ్యపెట్టిందని మండిపడ్డారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, బీసీ సబ్‌ప్లాన్, ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రతిపాదించిందని గుర్తుచేశారు. వాటిలో ఏ ఒకటీ అమలు కాలేదని విమర్శించారు. గత బడ్జెట్లో బీసీలకు రూ.9 వేల కోట్లు కేటాయించి.. ఖర్చు చేయలేదని స్పష్టంచేశారు. ఈసారి రూ.11 వేల కోట్లు కేటాయించారని.. ఎంత ఖర్చు చేస్తారో తెలియదని పేర్కొన్నారు.
కోర్టు మొట్టికాయలు వేశాక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి కులగణన చేశారని, అది కూడా తప్పులతడకగా ఉందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్ర ఉభయ సభల్లో అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని, తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తేనే దానికి చట్టబద్ధత వస్తుందని స్పష్టం చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని హామీ ఇచ్చి రేవంత్‌రెడ్డి ని లుపుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ కేంద్రంపై ఒత్తిడి తెస్తే 42శాతానికి చట్టబద్ధత వస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ఏ ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుందని స్పష్టం చేశారు.
ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని మధుసూదనాచారి డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు హాహాకారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైడ్రా, లగచర్ల ఘటనల్లో ప్రజలు, రైతులు రోడ్డెక్కగా.. ఇప్పుడు హెచ్‌సీయూలో విధ్వంసంతో విద్యార్థులు నిరసనలకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
సంపద సృష్టిస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఆస్తుల అమ్మకాలకు తెగబడుతున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ హరితహారం చేపడితే రేవంత్‌రెడ్డి హరిత హననం చేస్తున్నారని తూర్పారబట్టారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చట్టం చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో దీక్షకు రాహుల్‌గాంధీ, ఖర్గే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.