హనుమకొండ, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాట మార్చడం, మడమ తిప్పడం, హామీలపై ప్రజలను ఏ మార్చడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రివాజుగా మారిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. రాజకీయాల్లో అనేకమంది ముఖ్యమంత్రులను చూశామని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తన హోదాకు తగినట్టుగా లేడని అన్నారు. పరిపాలన చేతగాక ఎదుటి వారిని చులకన చేసే వ్యాధితో సీఎం రేవంత్ బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.
గురువారం ఆయన బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చర్చకు కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా సరే అని ముందుగా సవాలు చేసింది రేవంత్‌రెడ్డేనని, ఇప్పుడు ప్రెస్‌క్లబ్‌కు రానని తప్పించుకునే ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అధికారం కోసం పార్టీలు ఫిరాయించే సందర్భంలో ప్రెస్‌క్లబ్‌లో చర్చలకు హాజరయ్యారని, ఇప్పుడు ఆ క్లబ్బులు, పబ్బులు అని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ లేఖ రాస్తే అసెంబ్లీ పెడతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించడానికి ఏడాదిలో వంద రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని తాము లేఖ రాస్తే పెడుతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రుల మాటతీరు, ధోరణి అస్సలు బాగాలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో అసలు కేసీఆర్ పాత్ర లేదని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం వారి దుర్బుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. కేసీఆర్ ఉద్యమం చేపట్టకపోతే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు.
సీఎం ఢిల్లీ ప్రదర్శనలు చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుడపెతున్నారని ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణ అనుమతికి, ముడుపులు ఇవ్వడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పోతున్నారని చెప్పారు. యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. శాసనసభ, శాసనమండలిలో బీసీ కోటా బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేకమార్లు ఢిల్లీకి వెళ్లినా దీని గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కనీసం అడగలేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ఇకపై ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని మధుసూదనాచారి తెలిపారు.