హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): వేదిక ఏదైనా సీఎం రేవంత్ చిల్లరగా మాట్లాడుతూ అసందర్భ ప్రేలాపనలు చేస్తూ తెలంగాణ పరువుతీస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కసు, ఆక్రోశంతోనే తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను ఉద్దేశించి వెకిలిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన తెలంగాణభవన్‌లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రావి నారాయణరెడ్డి అవార్డుల ప్రదానోత్సవ సభలో సిట్ విచారణను ప్రభావితం చేసేలా సీఎం వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమ ని పేర్కొన్నారు. కేసీఆర్ ఏనాడూ తాను సిట్ విచారణ ఎదుర్కోనని అనలేదని స్పష్టంచేశా రు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే మొద టి నోటీసుకు సమయం కోరారని గుర్తుచేశా రు. బీఆర్ఎస్ నేతలు సర్కార్ అక్రమ కేసులు, విచారణలకు భయపడబోరని తేల్చిచెప్పారు. కోర్టులు, ప్రజాకోర్టుల ద్వారా దీటుగా బదులిస్తామని హెచ్చరించారు.
కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపితే..
14 ఏండ్లు మడమతిప్పని పోరాటం చేసి, ప్రాణాత్యాగానికి సిద్ధపడి తెలంగాణను సాధించిన కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ జాతిపితనేని మధుసూదనాచారి పేర్కొన్నారు. ఆయన నాలుగుకోట్ల మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిఉంటారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌కు చీమకాలంత కూడా ప్రమేయంలేదని, ఉద్యమకారులపై గన్ను ఎ క్కుపెట్టి రైఫిల్రెడ్డిగా నిలిచిపోయారని ఎద్దేవాచేశారు. విద్వేషపూరిత ప్రసంగాలు వద్దని జస్టి స్ సుదర్శన్‌రెడ్డి చేసిన సూచనలను పెడచెవినపెట్టిన రేవంత్.. అదే వేదిక మీద కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. హార్వర్డ్ వెళ్లొచ్చినా, మున్ముం దు అంతరిక్షం వెళ్లినా ఆయన బుద్ధి మారదని విమర్శించారు. కుక్కతోక వంకర చందంగా రేవంత్ మారబోరని ఎద్దేవాచేశారు.
మేడారం జాతర నిర్వహణలోనూ విఫలం
మేడారం జాతర నిర్వహణలోనూ కాంగ్రెస్ సర్కార్ దారుణంగా విఫలమైందని మధుసూదనాచారి ఆరోపించారు. శాశ్వత ఏర్పాట్లు చేస్తున్నామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, మంత్రులు కనీస వసతుల కల్పించకుండా చేతులెత్తేశారని విమర్శించారు. 15 గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయినా పట్టించుకొనే నాథుడేలేకుండా పోయారని మండిపడ్డారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఏనాడూ ఈ దుస్థితి నెలకొనలేదని చెప్పారు. జాతర నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం.. సమ్మక్క, సారలమ్మ భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కాలి ధూళికి కూడా రేవంత్ సరిపోరు: తక్కళ్లపల్లి
పదవులను త్యజించి ప్రత్యేక తెలంగాణను సాకారం చేసిన ఘనత కేసీఆర్ సొంతమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు వ్యాఖ్యానించారు. ఆయనపై సీఎం రేవంత్ కుసంస్కారంతో చేసిన విమర్శలు తెలంగాణ సమాజాన్ని బాధించాయని పేర్కొన్నారు. కేసీఆర్ కాలి ధూళికి కూడా రేవంత్ సరిపోరని విమర్శించారు. ‘రేవంత్‌తో తెలంగాణకు ఇసుమంతైనా మేలు జరిగిందా? ప్రజలకు అన్నీ చేసిన కేసీఆర్‌ను ఏమీచెయ్యని చేతగాని రేవంత్‌రెడ్డా విమర్శించేది? 2001లో రాష్ట్ర సాధన కు పార్టీ పెట్టి చంద్రబాబు, వైఎస్ లాంటి నేతలను ఎదుర్కొన్నది కేసీఆర్ కాదా? 2004లో వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నది నిజంకాదా? ఆయనలాగా రాష్ట్ర అవతరణ కోసం పదవులను వదులుకున్న చరిత్ర ఎవరికైనా ఉన్నదా?’ అని ప్రశ్నించారు.
అలాంటి మహానేతను ఉద్దేశించి ఇష్టారీతిగా మాట్లాడుతున్న రేవంత్ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరించారు. కోదండరాం పేరు ప్రస్తావించడానికి రేవంత్‌కు హక్కు ఎక్కడిదని నిలదీశారు. ఎమ్మెల్సీ ఇస్తానని ఆశచూపి నిండా ముంచింది మీరు కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే కోదండరాం కోరుకున్న పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారని, ఇందుకు తామే సాక్ష్యమని స్పష్టంచేశారు. కానీ, నాడు ఆయన పదవులు వద్దని నిరాకరించారని గుర్తుచేశారు. కానీ, ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్న రేవంత్ మొ సలి కన్నీరు కార్చుతున్నారని విమర్శించారు.