హనుమకొండ, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని, దుర్మార్గ పాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆరోపించారు. తెలంగాణ సాధన ఉద్యమంలో జరిగిన పరిణామాలు, ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ జిల్లాలను పునర్వ్యవస్థీకరించారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేక, పరిపాలన చేతగాక ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల మార్పు గురించి ప్రకటనలు చేస్తున్నదని మండిపడ్డారు.
బుధవారం ఆ యన బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హనుమకొండలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి పాలన చేతగాక.. చెడగొట్టు పనులు చేస్తున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయడం రేవంత్‌రెడ్డి తరంకాదని అన్నారు. పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని చెప్పారు. కేసీఆర్ దూరదృష్టితో, స్థానిక ఉద్యోగాలు స్థానికులకే దకాలనే ఉద్దేశంతో జోనల్ వ్యవస్థను తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రెండు జోన్లతో ఆవిర్భవించిన తెలంగాణలో స్థానికులకు 70 శాతం, ఓపెన్ క్యాటగిరీలో 30 శాతం పోస్టులు ఉండేవని… కేసీఆర్ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దకేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించి 7 జోన్లు ఏర్పాటు చేశారని చెప్పారు.
అన్ని జిల్లాల్లో సమీకృత కార్యాలయాలను ఏర్పాటు చేశారని.. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కార్యకలాపాలను జిల్లా కేంద్రాల్లో విస్తరించుకున్నాయని అన్నారు. ఉద్యోగాలపై మాట తప్పిన రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాసర్ మాట్లాడుతూ.. కక్షలు, ప్రతీకార చర్యలతోనే కాంగ్రెస్ పాలన కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. ఉద్యమ నేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫొటోలను మార్చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.