హైదరాబాద్, ఏప్రిల్14 (నమస్తేతెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలను నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయని మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో పాలకులు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాష్ట్రంలోని 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి నేటివరకూ కనీసం పూలమాల వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తున్నదని మండిపడ్డారు. ఆ మహనీయుడి స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. కేసీఆర్ పోరాట పటిమ, అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్-3తోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని ఉద్ఘాటించారు.
అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన బీఆర్ అంబేద్కర్ మన దేశంలో పుట్టడం అదృష్టమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. ఆయన రచించిన రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ ఏర్పాటైందని, రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తితో కేసీఆర్ దళితబంధు లాంటి గొప్ప పథకాలను అమలు చేశారని తెలిపారు. అంబేద్కర్ ఆయన చూపిన మార్గంలో మనమందరం ప్రజాసేవకు అంకితమవుదామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ తీరుతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. సమన్యాయం, ప్రజాస్వామ్యం, లౌకిక, సౌభాృతృత్వానికి భంగం వాటిల్లుతున్నదని తెలిపారు. అంబేద్కర్ బతికి ఉండగానే ఏడిపించిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో గంగా జమునా తెహజీబ్‌ను మంటగలుపుతున్నదని విమర్శించారు. జై భీం అంటూ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్‌గాంధీ ఏమీ ఎరుగనట్టు చోద్యం చూస్తుండటం విడ్డూరమని పేర్కొన్నారు.
అంబేద్కర్ దార్శనికతతో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగిందని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమ తెలిపారు. మహిళలకు చట్టసభల్లో గౌరవం దక్కిందని, ఆయన చూపిన మార్గంలోనే కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలనలో అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ విప్లవాత్మక పథకాలను అమలు చేశారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు.