హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తేతెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ..ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌తో పోల్చుకొనే స్థాయి నీకు లేదు.. నీకు నువ్వే కేసీఆర్‌తో పోల్చుకుని, కేసీఆర్ అంతటి నాయకుడినని భ్రమపడుతున్నావేమో.. కేసీఆర్ తెలంగాణ సాధించిన యోధుడు.. నువ్వు తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రా నాయకులకు తాకట్టు పెడుతున్న ద్రోహివి.. జర నోరు జాగ్రత్త’ అంటూ మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
పదేండ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దారని స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కొండంత హామీలిచ్చిన రేవంత్‌రెడ్డి చేసింది గోరంత అని సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. వెయ్యి రోజుల పాలనలో అన్నివర్గాల ప్రజలు నరకప్రాయమైన పరిస్థితులను ఎదురొంటూ విలవిలలాడుతున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ‘అడ్డగోలు హామీలిచ్చి అధికారం చేపట్టి వాటిని విస్మరించిన నీకు.. ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన కేసీఆర్‌ను దూషించే హక్కు ఎక్కడిది?’ అని నిలదీశారు. ఎన్నికల హామీలను అమలు చేయని రేవంత్‌రెడ్డి సిగ్గుతో తలదించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, హుందాగా వ్యవహరిస్తున్న ప్రతిపక్ష నాయకుడిపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
‘ఎన్నికల ముందు 100 రోజుల్లో అమలు చేస్తామంటూ ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి గద్గెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపిన నయవంచకుడా.. కేసీఆర్‌ను విమర్శించేది?’ అని నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి ఈ వెయ్యి రోజుల్లో కేసీఆర్ జపం చేయని రోజున్నదా?’ అని ప్రశ్నించారు. ప్రతి సందర్భంలోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పేర్లు ప్రస్తావిస్తూ తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృషిని మరల్చేందుకు యత్నించడం దుర్మార్గమని పేర్కొన్నారు.