హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : నగర శివారులోని మున్సిపాలిటీల్లో కొత్తగా విలీనమయ్యే గ్రామాల ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించి, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తుందో స్పష్టంచేయాలని మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గ్రామపంచాయతీల విలీనంతో ప్రజల ఉపాధి దెబ్బతినడంతోపాటు ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, వీటిపై ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ సవరణ బిల్లులో ఎన్నికల హామీ అయిన స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని డిమాండ్ చేశారు.