హైదరాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నేతలదే రాజ్యమని, రెడ్లు, అగ్రకుల నేతలు ఎలాంటి క్రమశిక్షణను ఉల్లంఘించినా వారిపై చర్యలు ఉండవని ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సొంత పార్టీ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేశారని, ఆయనపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడే క్రమశిక్షణ తప్పారని విమర్శించారు. కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎంత పెద్ద వారైనా.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు ఒకేవిధంగా ఉండాలన్నది తన అభిమతమని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావు ఉండకూడదని చెప్పారు.
గతంలో కొందరు పెద్ద నాయకులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోవడంపై అప్పటి పీసీసీ అధ్యక్షుడు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మధుయాష్కీ ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం నిర్వహించిన కులగణనను సైతం అగ్రకుల నేతలే డిసైడ్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీ కులగణనపై జరిగిన సమావేశానికి బీసీ నేతనైన తనను పిలవకుండా జానారెడ్డి, కేశవరావును పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు ఒక న్యాయం, ఇతరులకు ఒక న్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. తీన్మార్ మల్లన్న లేవనెత్తుతున్న అంశాలపై వివరణ ఇవ్వాల్సింది సీఎం రేవంత్‌రెడ్డేనని స్పష్టం చేశారు.